Allu Arjun: రోజుకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకం. అవి ఎప్పుడు మన మనస్సులో నుంచి పోవు. అలా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన సినిమా వేదం. డైరెక్టర్ క్రిష్ కలం నుంచి జాలువారిన ఒక అద్బుతం. మల్టీస్టారర్స్ ట్రెండ్ మొదలుకాకముందే ముగ్గురు హీరోలను, ఒక స్టార్ హీరోయిన్ ను పెట్టి సినిమా తీసాడు క్రిష్. అల్లు అర్జున్, మంచు మనోజ్, మనోజ్ భాజ్ పాయి, అనుష్క, దీక్షా సేథ్ నటించిన చిత్రం వేదం. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలక్షన్స్ తో పాటు అవార్డులను కూడా అందుకుంది. వేదం సినిమాకు నంది అవార్డు కూడా వరించింది. ఈ సినిమాలో ఐదు కథలు.. ఐదుగురి జీవితాలు.. ఎక్కడ మొదలై ఎక్కడకు చేరుకున్నాయి అనేది వేదం కథ.
కేబుల్ రాజుగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. అతడికి డబ్బు సంపాదించాలని ఆశ. దానికోసం గొప్పింటి అమ్మాయికి.. డబ్బున్న అబ్బాయినని అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ప్రేయసిని ఈవెంట్ కు తీసుకెళ్లడానికి డబ్బులు లేక దొంగతనం కూడా చేస్తాడు. కానీ, ఆ డబ్బు ఆశ కన్నా అతనిలోని మానవత్వం ఎక్కువ ఉండడంతో.. కోరుకున్న జీవితం పోయినా పర్లేదు అని డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు. ఇక చక్రవర్తిగా మంచు మనోజ్ నటించాడు. ఒక ధనిక సైనిక కుటుంబానికి చెందిన యువకుడు. యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్న చక్రవర్తికి సైన్యంలో చేరటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కాని తన తల్లి సైన్యం లో చేరమని బలవంత పెడుతూ ఉంటుంది. చక్రవర్తికి రాక్ స్టార్ కావాలనే కోరిక ఉంటుంది. చాలా కష్టపడితే హైదరాబాద్ లో ఒక ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరుకుతుంది. ఎలాగైనా తను ఎంచుకున్న సంగీతరంగంలోనే మంచి పేరు సాధించాలని అతని కోరిక. అలా అనే బయల్దేరతాడు. కానీ, చివరకు తన తండ్రిలానే దేశ సేవ చేస్తాడు.
ఇక వేశ్య సరోజగా అనుష్క కనిపించింది. ఒక స్టార్ హీరోయిన్ .. వేశ్యగా అందాలను ఆరబోస్తూ కనిపించడం అనేది అప్పట్లో పెద్ద రిస్క్. కానీ, కథను నమ్మి అనుష్క ఆ పాత్ర చేసింది. అమలాపురంలో సరోజ ఒక వేశ్య. తన యజమానురాలు సరిగా డబ్బు ఇవ్వటం లేదని భావించిన ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయి సొంత వేశ్యా గృహం స్థాపించాలని కలలు కంటూ ఉంటుంది. ఆమె సహాయకుడుగా కర్పూరం కూడా వస్తుంది. కొందరిని నమ్మి.. వారికి డబ్బులు ఇచ్చి.. ఏమి తెలియని పట్టణంలో సరోజ ఎలా తన ఉనికిని కాపాడుకుంది.. ?
రహీముల్లా ఖురేషీగా మనోజ్ బాజ్పాయ్ కనిపిస్తాడు. పాత బస్తీలో వినాయక నిమజ్జనంలో జరిగిన అల్లర్ల వల్ల తన భార్య గర్భంలో ఉన్న కవల పిల్లలను పోగొట్టుకొంటాడు. పోలీసులు న్యాయం చేయక పోగా తనే ఒక తీవ్రవాది అనే ముద్ర వేసి నిత్యం అవమాన పరుస్తుంటారు. ప్రశాంతంగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో షార్జా వెళ్ళటానికి వీసా సంపాదిస్తాడు ఖురేషీ. చివరికి అతనికి ఏమైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాములు కథ వేరు. మనవడిని కాపాడుకోవడానికి ఒక తల్లి, తాత ఎంత కష్టపడ్డారు అనేది ఈ సినిమాలో చూపించారు. వీరందరూ కూడా చివర్లో ఒకే దగ్గరకు వచ్చి చేరతారు. దేశాన్ని కాపాడడం కన్నా వేరే ఏది గొప్పది కాదు అని కేబుల్ రాజు, చక్రవర్తి అనుకోని బాంబ్ బ్లాస్ట్ లో మిగతావారిని కాపాడి అమరులుగా నిలుస్తారు.
ఒక్కో కథలో ఒక్కో ఎమోషన్ ను చూపించాడు క్రిష్. మనిషి ఆశకు.. మానవత్వానికి ముడిపెట్టాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రూపాయి సాంగ్ అయితే ఇప్పటికీ ఎవరో ఒకరిని మోటివేట్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా వచ్చి నేటికీ 15 ఏళ్లు ముగియడంతో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. ఎక్స్ ద్వారా డైరెక్టర్ క్రిష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ” 15 సంవత్సరాల వేదం.. నా కెరీర్ లో నేను ఊహించని సినిమా. ఇంత నిజాయితీగా ఇలాంటి ఒక కథను రూపొందించినందుకు క్రిష్ నీకు కృతజ్ఞతలు. నాతోపాటు నటించిన నా కో స్టార్స్ అనుష్క, మనోజ్, మనోజ్ బాజ్ పాయ్.. మిగతావారందరితో ఈ ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడం నిజంగా ప్రత్యేకమైనది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సర్ ఇంతటి ధైర్యమైన దార్శనికతకు మద్దతు ఇచ్చినందుకు మొత్తం బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వేదంను ఇంతగా స్వీకరించి ఒక టైమ్ లెస్ సినిమా మార్చినందుకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు.
15 years of Vedam 🙏🏽
A film that was out of the box for me.
Gratitude to @DirKrish garu for crafting something so honest.
To my amazing co-stars @MsAnushkaShetty, @HeroManoj1 & @BajpayeeManoj sir , and many others . Sharing this journey with you all was truly special .… pic.twitter.com/fQ4VSGCcAd— Allu Arjun (@alluarjun) June 4, 2025