Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కు గత కొన్ని రోజులుగా హత్య బెదిరింపులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయనకు మరోసారి ఇలాంటి బెదిరింపు మెసేజ్ వచ్చింది. 5 కోట్లు డిమాండ్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని వార్నింగ్ లో పేర్కొన్నాడు. అయితే తాజాగా ఈ బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సదరు వ్యక్తి ఓ సాంగ్ రైటర్ కావడం అందరికీ షాక్ ఇస్తుంది.
నవంబర్ 7న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సప్ నెంబర్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మెసేజ్ లో అజ్ఞాత వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi) కు చెందిన వ్యక్తిని అని పేర్కొన్నాడు. ఒకవేళ సల్మాన్ (Salman Khan) 5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని మెసేజ్ ద్వారా బెదిరించాడు. అయితే బెదిరింపుల అనంతరం వాటిపై విచారణ చేపట్టిన పోలీసులు రాయచూరు నుంచి సల్మాన్ కు ఆ వ్యక్తి మెసేజ్ పెట్టినట్టు గుర్తించారు. విచారణలో భాగంగా ముంబై పోలీసులు కర్ణాటకకు ఓ బృందాన్ని పంపగా, వెంకటేష్ నారాయణ అనే వ్యక్తి వద్ద ఆ నెంబర్ ఉన్నట్టుగా తెలుసుకున్నారు.
కానీ నారాయణ మొబైల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అతని ఫోన్ కు వాట్సప్ ఇన్స్టాలేషన్ ఓటిపి వచ్చినట్టుగా కనిపెట్టారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి నారాయణ ఫోన్ వాడుకుని ఓటీపీ ఆధారంగా వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా వెళ్లడైంది. అలా సల్మాన్ ఖాన్ బెదిరింపుల విషయంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆ 5 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని సోహెల్ పాషా అనే సాంగ్ రైటర్ గా గుర్తించారు.
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన గేయ రచయిత సోహెల్ పాషా (Sohel Pasha). అయితే తను రాసిన పాట ఫేమస్ కావాలన్న ఉద్దేశంతోనే అతను సల్మాన్ (Salman Khan) ను బెదిరించినట్టుగా తాజాగా పోలీసు విచారణలో వెల్లడించాడు. కాగా ఈ వ్యక్తి ‘మై సికందర్ హు’ అనే సాంగ్ ను రాశాడు. రాయచూర్ సమీపంలో ఉన్న మానవి గ్రామంలో క్రైం బ్రాంచ్ పోలీసులు పాషాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని ముంబైకి తీసుకొచ్చి పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ కు గత కొన్ని నెలల్లో సల్మాన్ ఖాన్ కు కనీసం నాలుగు బెదిరింపు మెసేజ్ లు రావడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే సల్మాన్ (Salman Khan) కు భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆయన ప్రస్తుతం ‘సికిందర్’ (Sikandar) మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా, సల్మాన్ కు రక్షణగా ఏకంగా 70 మంది ఉండడం గమనార్హం. సౌత్ డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ బెదిరింపుల నేపథ్యంలో ఇంట్లో కూర్చోకుండా ఈ హిందీ బిగ్ బాస్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.