Gymkhana OTT..’ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నస్లెన్ (Naslen) మరో ముగ్గురు నటులతో కలిసి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అలప్పుజ జింఖానా’.. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మలయాళ అనువాద చిత్రం అనుకున్న రోజు కంటే ముందే ఓటీటీలోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు కంటే ముందే ఏప్రిల్ 10న కేరళలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గతంలో టోవినో థామస్, కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లో ‘తల్లుమాల’ అనే సినిమాతో కేరళ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఖలీద్ రెహమాన్(Khalid Rahman) ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించడం విశేషం.
బడ్జెట్ రూ.5 కోట్లే.. లాభం మాత్రం..
కేవలం రూ.5కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ.70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి, కేరళ నాట అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇకపోతే మొన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. సుమారుగా 55 రోజుల తర్వాత ముందస్తుగా ప్రకటించిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నా.. అభిమానులు మాత్రం సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు.
ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన అలప్పుజ జింఖానా..
ఇకపోతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘సోనీ లివ్’ లో జూన్ 12 నుంచి ఓటీటీలో మలయాళం తో పాటు తెలుగు అలాగే ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా సినిమా ఎండింగ్ వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే.. ఎలాంటి లాజిక్ లు వెతక్కుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడవచ్చు అని ఇప్పటికే సినిమా చూసిన ఎంతోమంది తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేశారు. మొత్తానికైతే ‘అలప్పుజ జింఖానా’ ఆడియన్స్ ను ఓటీటీలో కూడా తెగ అలరిస్తోంది అని చెప్పవచ్చు.
also read: Kantara 2: దేవుడితో ఆటలు.. ‘పంజుర్లి’ హెచ్చరికలు నిజమవుతున్నాయా?
అలప్పుజ జింఖానా సినిమా స్టోరీ..
అలప్పుజ జింఖానా సినిమా స్టోరీ విషయానికి వస్తే.. జో జో జాన్సన్ (నస్లెన్), డీజే, పెద్దోడు, చిన్నోడు, చిరుత, సెహనావాస్ ఇలా ఐదు మంది చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. అయితే ఇంటర్ ఫలితాలలో ఒకరు మాత్రమే పాస్ అవుతారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి చదువుకోవడం మనవళ్ల కాని పని అని డిసైడ్ అయ్యి , ఏదైనా కొత్తగా ట్రై చేయాలని నిర్ణయించుకుంటారు. అలా బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కులతోనే బయటపడొచ్చు అని కూడా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే దగ్గర్లో ఉన్న జింఖానా బాక్సింగ్ అకాడమీలో శిక్షణ కోసం చేరుతారు. ఇక అక్కడ జరిగిన పరిణామాలేంటి? వారు సరిగ్గా పని చేయలేక సీరియస్నెస్ లేక బాక్సింగ్ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట చేసే విన్యాసాలు ఏంటి? ఇక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ ఆడాల్సి వచ్చినప్పుడు చివరికి వారు ఏం చేశారు? ఎలా ముగించారు? అనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. సినిమా చూసినంత సేపు కూడా ఆడియన్ పొట్ట చెక్కలవ్వడం ఖాయం. ఇకపోతే ఇందులో హీరో ఎవరు అనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఎవరికి వారు తమ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఫస్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్, అమ్మాయిలకు సైట్ కొట్టే సరదా సరదా సన్నివేశాలతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ బాక్సింగ్ పోర్ట్ లో యాక్షన్ సీన్లతో ఒక ఆట ఆడేసుకుంటారు.