Kantara 2..కాంతారా (Kantara).. రిషబ్ శెట్టి (Rishabh Shetty) దర్శకుడిగా, హీరోగా నటించిన చిత్రం ఇది. ప్రాంతీయంగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రజలను మెప్పించింది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు నీరాజనాలు పట్టారు. అంతేకాదు పలు అవార్డులు సైతం ఈ సినిమాకు లభించాయి. ఇకపోతే ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాకి ముందు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ..” కాంతారా చాప్టర్ వన్” అంటూ సినిమాను ప్రకటించారు రిషబ్ శెట్టి. ఇక అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇప్పుడు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టారో ఈ సినిమా కోసం పని చేస్తున్న ఆర్టిస్టులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం నిజంగా పలు అనుమానాలకు తెరతీస్తోంది.
కాంతారా షూటింగ్లో వరుస విషాదాలు..
ఇప్పటివరకు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. నవంబర్ 2024 లో షూటింగ్ కోసం సినిమా ఆర్టిస్టులందరూ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కొల్లూరు సమీపంలోని జడ్కల్ లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తాపడడంతో ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. ఆ బృందంలోని ఇద్దరు ఆర్టిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ సంఘటన నుంచి చిత్ర బృందం ఇంకా తేరుకోకముందే.. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్టు ఎం.ఎఫ్ కపిల్ ఈ ఏడాది మే నెలలో కొల్లూరు లోని సౌకర్ణికా నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశారు. అయితే ఆరోజు సినిమా షూటింగ్ జరగలేదు కాబట్టి దీనికి కాంతార చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని బృందం క్లారిటీ ఇచ్చినా.. ఉన్నట్టుండి జూనియర్ ఆర్టిస్టు మరణం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక ఇది జరిగిన కొన్ని రోజులకే అదే నెలలో 12వ తేదీన కాంతారా కళాకారుడు రాకేష్ పూజారి కూడా గుండెపోటుతో మరణించాడు. ఆయన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే చాలామంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోయారు. అంతేకాదు రాకేష్ అంత్యక్రియలకు హీరో రిషబ్ శెట్టి హాజరు కాకపోవడంపై కూడా కొంతమంది విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత రాకేష్ కుటుంబ సభ్యులను రిషబ్ కలవడంతో ఆ వివాదం కాస్త అక్కడికే సద్దుమణిగింది.
మరో యంగ్ నటుడు మృతి..
ఇక రెండు రోజుల క్రితం మరో విషాదం చోటుచేసుకుంది. కేరళలోని త్రిసూర్ కి చెందిన విజు వికే కూడా ‘కాంతారా’ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. ఆయన అగుంబే సమీపంలో హోం స్టే లో ఉంటున్నారు అయితే . జూన్ 11న బుధవారం రాత్రి ఆయనకి కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను దగ్గర్లోని తీర్థహళ్లి లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. మార్గం మధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇలా కాంతారా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ఎవరో ఒకరు ఇలా మరణించడం అందరిలో పలు అనుమానాలతో పాటు భయాలను కూడా రేకెత్తిస్తోంది. ఇకపోతే ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చాలామంది వీటిని పంజుర్లి దేవుని హెచ్చరికలే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also read: Lavanya Tripathi: 13 ఏళ్ల క్రితమే చిరు నా పెళ్లికొచ్చారు.. ట్విస్ట్ ఇచ్చిన మెగా కోడలు!
పంజుర్లి హెచ్చరికలు నిజమవుతున్నాయా?
దీనికి తోడు ‘కాంతారా – చాప్టర్ వన్’ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్ లో జరిగిన వార్షిక ఉత్సవాలకు హాజరవ్వగా.. పండుగ పూర్తయిన తర్వాత పంజుర్లి దేవుడు పూనిన పూజారి రిషబ్ శెట్టితో..”నీ చుట్టూ చాలామంది శత్రువులే ఉన్నారు. నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. కానీ నువ్వు నమ్మిన దేవుడు కచ్చితంగా నిన్ను కాపాడుతాడని “చెప్పారట. దీంతో ఈ రిషబ్ తో పాటు అక్కడున్న వారందరూ కూడా ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వారాహి పంజుర్లి హెచ్చరికలు నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రానికి పునాది వేసిన రిషబ్ శెట్టి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.