Rewind 2024 : మరో ఐదు రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సంగీత ప్రియులను అలరించిన తెలుగు సినిమా పాటలు ఎన్నో వచ్చాయి. కొన్ని సాంగ్స్ అయితే సినిమా విడుదల అవ్వకముందే, ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటే.. మరికొన్ని పాటలు సినిమా విడుదలైన తర్వాత జనాలలోకి బాగా వెళ్లిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అయిన పాటలు కొన్ని ఉంటే, నెట్టింట దుమ్మురేపిన డాన్స్ వీడియోలు కూడా ఇంకొన్ని ఉన్నాయి. మరి మొత్తానికి ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన బెస్ట్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
గుంటూరు కారం..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఏడాది మ్యూజికల్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎస్.ఎస్. థమన్ స్వరపరిచిన “దమ్ మసాలా బిర్యానీ”, “కుర్చీ మడత పెట్టి”, “మావ ఎంతైనా” పాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కాలేజీ ఈవెంట్స్, పార్టీలలో, పెళ్లిళ్లలో, ఊరేగింపులలో కూడా ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించడం గమనార్హం. దీనికి తోడు మహేష్ బాబు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్టెప్పులు వేసి అభిమానులను మెప్పించారు. సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా “కుర్చీ మడత పెట్టి” సాంగ్ అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ ని బ్లాస్ట్ చేసేసింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రీల్స్ చేస్తూ ఆడియన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు 523 మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించింది ఈ పాట.
దేవర…
కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన ‘ దేవర -పార్ట్ వన్’ సినిమా కోసం అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా “ఫియర్ సాంగ్”, “చుట్టమల్లే”, “ఆయుధపూజ”, “దావుడి” ఇలా మొత్తం నాలుగు పాటలు కూడా దేనికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లే పాట మెలోడీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనిపించుకుంది.
పుష్ప 2: ది రూల్..
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమా నుంచి పాటలు కాస్త ఆలస్యంగానే వచ్చినా.. జనాలలోకి మాత్రం వేగంగానే వెళ్లాయి. “పుష్ప పుష్ప” సాంగ్ బాగా వైరల్ అయిపోయింది. అలాగే “సూసేకి” లిరికిల్ వీడియో కొన్నాళ్ళు బాగా ట్రెండింగ్ లో ఉంది. ఆ తర్వాత “కిస్సిక్”, “పీలింగ్స్” పాటలు సినిమా విడుదలైన తర్వాత బాగా ట్రెండ్ అయ్యాయి.
హనుమాన్…
సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టిన చిత్రంగా నిలిచిన ‘హనుమాన్’ సినిమాలో “పూలమ్మే పిల్ల” పాట బాగా పాపులర్ అయింది.
అలాగే ‘ఓం భీమ్ బుష్’ సినిమాలోని “అణువణువూ”, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా నుంచి వచ్చిన “గుమ్మా” పాటలు మ్యూజికల్ ట్రీట్ ఇచ్చాయి. మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిజాస్టర్ గా మారినప్పటికీ ఈ సినిమాలో “నల్లంచు తెల్లచీర” పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.. ‘జనక అయితే గనక’ చిత్రంలో “నా ఫేవరెట్ నా పెళ్ళాం” పాట కూడా బాగా వైరల్ అయింది. ఈ పాటలన్నీ కూడా ఈ ఏడాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.