CM Revanth Reddy: సీఎం సార్.. మీరే కరెక్ట్.. మీ మాటలో నిజాయితీ.. మీ మాటలో పదునుంది. ఏ మాత్రం తగ్గొద్దు సార్.. మీరు తీసుకున్న నిర్ణయం ఓ రికార్డ్ అంటున్నారు నెటిజన్స్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల తెలంగాణ వాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మీరు సూపర్ సార్ అంటూ కితాబిస్తూ, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నెటిజన్స్.
పుష్ప 2 సినిమా రిలీజ్ సంధర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషయం తెల్సిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, శ్రీ తేజ్ అనే బాలుడు ఇప్పుడిప్పుడే కోలుకోవడం మనకు తెలిసిన విషయమే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అయితే వినోదం కోసం వచ్చిన మహిళ తొక్కిసలాటలో చనిపోవడం, ఓ బాబు అపస్మారక స్థితికి వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అక్కడ పోలీసులు సకాలంలో స్పందించకుంటే, ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. అప్పుడు ఆఘటనకు భాద్యులెవరనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా, ప్రాణనష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలుమార్లు సంబంధిత అధికారులతో చర్చించారు. సీఎం చొరవతో టాలీవుడ్ కూడా స్పందించి శ్రీ తేజ్ ను పరామర్శించడం, ఆర్థిక సహాయం అందించడం ఆనందించదగ్గ విషయం. అలాగే టాలీవుడ్ పెద్దలు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం తాను చెప్పాల్సిన మాటలు తెగేసి చెప్పారు. మాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరి మీద కోపం లేదు. చట్ట ప్రకారమే నడుచుకుంటాం. మంత్రి వర్గ ఉప సంఘ భేటీ వేస్తున్నట్లు, మీరు కూడా కమిటీ వేసుకోండంటూ సీఎం సూచించారు.
జనం కోసమే ఆ నిర్ణయం..
జనం కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా టికెట్ విషయంలో రాజీ లేని రీతిలో సీఎం తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. వినోదం అందరికీ సొంతం కావాలి కానీ, కొందరికే అన్న రీతిలో ధరలు ఇష్టారీతిన పెంచడంపై సీఎం మాట్లాడినట్లు సమాచారం. అలాగే బెనిఫిట్ షోలకు నటులు రావడం వల్ల, అనుకోని ఘటనలు జరిగే అవకాశం ఉందని, ఇటువంటి వాటిపై కూడా సినిమా పెద్దలు ఆలోచించాలని సీఎం సూచించారట.
సినిమా పరిశ్రమ ఎదగాలన్నదే ప్రధాన ఉద్దేశమని, కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా రంగానికి ఆది నుండి ప్రోత్సహిస్తూ వచ్చిందన్నారు సీఎం. ఇక బెనిఫిట్ షోలపై మాత్రం సీఎం తాను చెప్పాలనుకున్న విషయాన్ని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, నిజ జీవితంలో కూడా హీరోలు వారికి తగినట్లుగా సమాజానికి మేలు చేసేందుకు ముందుకు రావాలని సీఎం సూచించారు.
డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై సినిమా రంగం ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పర్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సినిమా ప్రారంభ సమయంలో కూడా యువతను చైతన్యపరిచే అంశాలను ప్రస్తావిస్తే, సమాజానికి మేలు చేకూరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సినిమా రంగంను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సీఎంతో భేటీ జరిగిందన్నది వాస్తవం.
Also Read: CM Revanth Reddy – Tollywood: రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ.. ఇదిగో ఫోటోలు
ఒక్క ఘటన జరిగిన వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా చొరవ చూపడంపై నెటిజన్స్ అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాదు సినిమా విడుదల సంధర్భంగా మరొకసారి సంధ్య థియేటర్ ఘటనలు జరగకుండా, నిర్ణయాలను తీసుకోవడంతో సీఎం సార్.. మీరు సూపర్ సార్ అంటూ సోషల్ మీడియా మారుమ్రోగుతోంది. ఏదిఏమైనా ప్రజల ప్రాణరక్షణకు సీఎం స్పందించిన తీరుకు తెలంగాణ సమాజం జేజేలు పలుకుతోంది.