Dil Raju : టాలీవుడ్ సినీ పెద్దలు (Tollywood), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీలో ఎలాంటి అంశాలను చర్చించారు అనే విషయాలను దిల్ రాజు తాజాగా వెల్లడించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడమే లక్ష్యంగా ఈ భేటీ సాగిందని వెల్లడించారు.
దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ “తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో షేర్ చేసుకున్నారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై చర్చ జరిగింది. దానికి తగ్గట్టుగానే మేమంతా కలిసి పని చేస్తాము. ఇక రెండవది… ఇండియన్ సినిమా వాళ్లే కాకుండా హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చ జరిగింది. దానిపై చిత్రపరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్‌డీసీ ద్వారా ముఖ్యమంత్రికి దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తాం. హైదరాబాద్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్ గా మార్చడానికి అడుగులు వేస్తాం. మూడవది… డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి దర్శకనిర్మాతలు, నటీనటులు సహకరిస్తారు. ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది అనేది అపోహ మాత్రమే. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నేను బాధ్యతలు తీసుకుని కేవలం వారం రోజులే అయ్యింది. యూఎస్ వెళ్లి రాగానే ముందుగా ముఖ్యమంత్రిని కలిశాను. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ చర్చ జరిగింది” అని దిల్ రాజు వెల్లడించారు.
అయితే బెనిఫిట్ షోలు ఇకపై ఉండవు అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఆ విషయం గురించి చర్చ జరిగిందా? అనే ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ… “బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చాలా చిన్న విషయం. అదంత ముఖ్యమైన విషయం కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా తెలుగు చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడం మాత్రమే అజెండా” అని అన్నారు దిల్ రాజు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన స్పీచ్ లో ఈ విషయాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ (Dil Raju) రాజును ఎఫ్డిసి ఛైర్మన్ గా నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు. హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం అంటూ సినిమా పరిశ్రమపై స్పెషల్ గా ఫోకస్ చేస్తామని అన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆయన సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలని అన్నారు.