Big TV Kissik Talks: విలక్షణ నటుడిగా, రాజకీయ నేతగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్నారు బాబు మోహన్(Babu Mohan). తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి.. 2024 అక్టోబర్ 29న రాజకీయ జీవితానికి స్వస్తి పలికారు బాబు మోహన్. ఇక ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ తాను పది సినిమాలలో నటిస్తున్నాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు. ఇక తనకు ఈ సినిమా జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఆయనే అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
నాకు సినిమా జీవితాన్ని ప్రసాదించింది ఆయనే – బాబు మోహన్
అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో కి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు బాబు మోహన్. తాజాగా ఈ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో భాగంగానే తన సినిమా జీవితానికి పునాది వేసిన వ్యక్తుల గురించి తెలిపారు. బాబు మోహన్ మాట్లాడుతూ.. “నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy)మాత్రమే. ఆయనే ‘ఆహుతి’సినిమాలో నాకు అవకాశం కల్పించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాకి కూడా అవకాశం కల్పించారు. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా 10 సినిమాలలో అవకాశం వచ్చింది. ఇక అలా వరుసగా సినిమాలు చేస్తూ నాకంటూ ఒక ఇమేజ్ దక్కించుకున్నాను. ఒకప్పుడు రవీంద్ర భారతిలోకి అడుగుపెడితే చాలు అనుకున్నాను. కానీ అదే రవీంద్ర భారతి వేదికపై పదుల సంఖ్యలో నాటకాలు చేశాను. ఎన్నో సన్మానాలు కూడా జరిగాయి. ఇక ఇంతకంటే నాకేం కావాలి. దీనంతటికీ కారణం శ్యాం ప్రసాద్ రెడ్డి మాత్రమే ” అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు బాబు మోహన్.
ALSO READ:Big TV Kissik Talks: 73 ఏళ్ల ప్రాయంలో కూడా ఇంత ఆరోగ్యం.. నేటి తరానికి సీక్రెట్ రివీల్..!
యాచకుడి పాత్రతో భారీ గుర్తింపు..
ఇక ఈయన నేపథ్యం విషయానికి వస్తే.. ఖమ్మం జిల్లాలోని బీరోలు లో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు బాబు మోహన్. ఇక సినిమాల్లోకి అడుగుపెట్టి యాచకుడి పాత్రతో హాస్యనటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మామగారు వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) తో ఈయన కాంబినేషన్ బాగా హిట్ అయింది అని చెప్పాలి.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే అప్పట్లో చాలా మంది రచయితలు తమ సినిమాలలో ప్రత్యేకించి ఈ జోడి కోసమే సన్నివేశాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలా పలు చిత్రాలలో నటించి తనకంటూ పేరు సొంతం చేసుకున్న ఈయన 73 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక 2025 లో ‘సోదర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంపూర్ణేష్ బాబు(Sampoornesh babu) ఇందులో హీరోగా నటించడం జరిగింది. ఈ సినిమాతో పాటు మరో పది ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నట్లు సమాచారం.