Operation Sindoor : పహల్గామ్ ఉగ్రదాడి పేరు వినగానే జనాల గుండెల్లో వణుకుపుడుతుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్‌కు ఇద్దరు మహిళా సైనికాధికారులు నేతృత్వం వహించడం అంతర్జాతీయంగా దీనికి గుర్తింపు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్‌కు సినీ వర్గాల్లో డిమాండ్ పెరిగిందని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. డిమాండ్ మాత్రమే కాదు… దీని కోసం ఒకరికి పోటీగా మరొకరు అప్లే చేసుకుంటున్నారట. అసలు ఈ టైటిల్ గొడవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం.
‘ఆపరేషన్ సింధూర్’ కోసం పోటీ..
ఈ టైటిల్ తో సినిమా తీయాలని బాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సింధూర్ పేరుకు డిమాండ్ పెరిగింది. సుమారు 15 నిర్మాణ సంస్థలు ఈ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఇంపా)లో దరఖాస్తు చేసినట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ టైటిల్ హాట్ టాపిక్ గా మారడంతో ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ పెరిగింది.
దాంతో మాకు కావాలి మాకు కావాలి అంటూ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలామంది నిర్మాతలు ఈ టైటిల్ ని బుక్ చేసుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. టీ-సిరీస్, జీ స్టూడియోస్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ పోటీలో ఉన్నాయి. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం ఇటీవల నిర్వహించిన ఒక ఆపరేషన్ నుంచి ప్రేరణ పొందింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సినీ పెద్దలు ఎవరికి అన్నది తేల్చుకోలేకున్నారని ఇండస్ట్రీలో టాక్..
ఈ టైటిల్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..
‘ఆపరేషన్ సింధూర్ ‘ టైటిల్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశోక్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అందరి దృష్టిని ఆకర్షించే పేరున తమ సినిమాకు పెట్టాలని ఆసక్తి చూపిస్తుంటారు దర్శక నిర్మాతలు. ముందుగా పేరు అనుకోకుండా ఏ సినిమాను రూపొందించలేం. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వీరిలో అందరూ టైటిల్ తో సినిమా తీస్తారని చెప్పలేం. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ కొద్దిరోజులు పోతే ఉండకపోవచ్చు. అందుకే ఈ టైటిల్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చ జరుగుతుందని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని నిర్మాణ సంస్థలు విత్ డ్రా కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే టైటిల్ టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ లోనూ నమోదవుతున్నట్లు సమాచారం.
కొంత మంది నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తెలుగులో సింధూరం పేరుతో ఆల్రెడీ ఒక సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ టైటిల్ తో ఏ నిర్మాణ సంస్థ సినిమా తీస్తారో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ టైటిల్ కోసం ఇలాంటి చర్చ జరగడం టాలీవుడ్ జనాల్లో ఆసక్తిగా మారింది…