Dil Raju: సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై ఒక పత్రిక ప్రకటన (Press Note) విడుదల చేశారు. తాజాగా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్ల నిర్వహణపై కీలక ఆదేశాలను జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు కుటుంబంతో సహా థియేటర్లకు వచ్చి సినిమా చూసే వాతావరణన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇలా ప్రేక్షకుల కుటుంబంతో సహా థియేటర్లకు రావాలి అంటే థియేటర్లలో లభించే ఫుడ్ తో పాటు సినిమా టికెట్ల రేట్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అంటూ ఈయన పలు ఆదేశాలను జారీ చేశారు. ఇలా సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ జారీ చేసిన ఈ కీలక ఆదేశాలపై నిర్మాత దిల్ రాజు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
దిల్ రాజు విడుదల చేసినటువంటి ఈ ప్రకటనలో భాగంగా… సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం అనే అంశం పై గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలను, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న వారి అభిప్రాయం ఎంతో అభినందనీయమైనది. దీనిని మనమందరం స్వాగతించి కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. అదేవిధంగా థియేటర్ల నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కు సినిమాలు త్వరగా వెళుతున్న నేపథ్యంలో ప్రేక్షకులదరూ కూడా థియేటర్లకు రాకుండా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఒక సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత ఎంత కాలానికి ఓటీటీలోకి వెళ్లాలి అనే విషయంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రేక్షకుడికి వెళ్లి తెరపై సినిమా చూసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడం మన బాధ్యత.
ఇకపై ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది. అందుకే తెలుగు చిత్రపరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు వెళ్లాలి. ఈ దిశగా తొలి అడుగులు వేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే మనం ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాల పట్ల తెలంగాణ ప్రభుత్వంతో కూడా తాను సంప్రదింపులు చేసి మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుదాం అంటూ సుదీర్ఘమైనటువంటి పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ గతంలోనూ ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ వచ్చారు ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సినిమా చూస్తున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వ్యవహార శైలి మాత్రం మారకపోవడంతో పలు కీలక ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న తరుణంలో థియేటర్లు బంద్ చేయాలి అంటూ పిలుపునివ్వడంతో పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది.