Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ (Venkatesh)హీరోగా, ప్రముఖ సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)కాంబినేషన్లో వస్తున్న చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి వస్తున్నాం అంటూ జనవరి 14వ తేదీన వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను ప్రారంభించబోతున్నారట ఈసారి ప్రమోషన్స్ కి రూపాయి ఖర్చు లేకుండా నిర్మాతలు లాభపడేలా ప్లాన్ చేయబోతున్నారట అనిల్ రావిపూడి. మరి దీనికోసం ఏం చేయబోతున్నారు? అసలు ఆయన ప్లాన్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ప్రమోషన్స్ లో రాజమౌళి దిట్ట..
సాధారణంగా సినిమా విడుదల సమయంలో ఎవరికి వారు పబ్లిసిటీ కోసం తమ స్ట్రాటజీని ఉపయోగిస్తారు. అయితే ఎవరు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్లినా.. అంతిమంగా రిలీజ్ సమయానికి సినిమాను జనాల్లోకి వెళ్లడమే లక్ష్యం. ఇక్కడే ఎవరి మేధాతనం వారు ఉపయోగిస్తారు. అటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో రాజమౌళి డిఫరెంట్ స్ట్రాటజీతో ఈ రెండు సినిమాలను జనాలలోకి తీసుకెళ్ళి భారీ సక్సెస్ అందుకున్నారు. అందుకోసం ఆయన కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అయితే అనిల్ మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేస్తూ.. తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు.
ఉచిత ప్రమోషన్స్ చేయడంలో అనిల్ తర్వాతే ఎవరైనా..
ముఖ్యంగా సినిమాలో నటించిన నటీనటులనే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటాడు. ఈ విషయంలో హీరోయిన్లను కూడా వదలడు అనిల్ రావిపూడి. వాళ్లతో ఆ సినిమాలో పాటలకు డ్యాన్సులు చేయించిన వీడియోలను కూడా బయటకు వదులుతూ ఉంటాడు.ముఖ్యంగా పబ్లిసిటీ లో భాగంగా స్పెషల్ కాన్సెప్ట్లతో వీడియోలు చేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు మీడియా మీట్ లో వేదికపై హీరో హీరోయిన్లతో రకరకాల ఫీట్లు కూడా చేయిస్తాడు. తన సినిమా కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని మీడియాకి టాస్క్ లు విసురుతూ సినిమా గురించి ఎక్కువగా ఫిలిం మీడియాలో డిస్కషన్ జరిగేలా చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఇది జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఇలాంటి ప్రచారం నిర్మాత జేబు నుంచి రూపాయి కూడా తీయనివ్వదు.. అంతా ఉచితంగానే జరుగుతుంది. అందుకే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ లతో అనిల్ రావిపూడి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడని చెప్పవచ్చు.
వెంకటేష్ సినిమాలు..
గత కొద్ది రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ కి సంబంధించి “గోదారి గట్టుమీద” పాట రిలీజ్ చేయగా.. ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు..మరి సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.