Gandhi Tatha Chettu Trailer : డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి (Sukriti Veni) ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధు రావులు సంయుక్తంగా నిర్మించారు. సుకుమార్ భార్య భబితా సుకుమార్ ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఇంటర్నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించి, పలు అవార్డులను సొంతం చేసుకుంది. జనవరిలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం వేగం పెంచింది. అందులో భాగంగానే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘గాంధీ తాత చెట్టు’ మూవీ ట్రైలర్ లో ఉన్న హైలెట్స్ ఏంటంటే ?
ట్రైలర్ హైలెట్స్ ఇవే…
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర బృందాన్ని విష్ చేశారు. ఈ మూవీ సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు మహేష్ బాబు “గాంధీ తాత చెట్టు ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ మనసుకు హత్తుకునేలా ఉంది. సుకృతితో పాటు గాంధీ తాత చెట్టు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు” అంటూ మూవీ హిట్ కావాలని కోరుకున్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే… సుకృతి ఇందులో అద్భుతంగా నటించింది. గాంధీ సిద్ధాంతాలను నూరి పోసే తాత, వాటిని తూచా తప్పకుండా అనుసరించే ఓ 13 ఏళ్ల అమ్మాయి కథతో ఈ మూవీ నడవబోతుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఫ్యాక్టరీ పెట్టే ఆలోచనతో ఓ వ్యక్తి ఆ ఊరి పచ్చని పొలాలను కొనడానికి రావడం, ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో చాలామంది పొలాలను అమ్మేసుకోవడం ట్రైలర్ లో చూడవచ్చు. ఆ తర్వాత ఆ ఊరిని, అందులో ఉన్న ఒక చెట్టును కాపాడుకోవడానికి 13 ఏళ్ల అమ్మాయి ఏం చేసింది? అనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది ట్రైలర్.
ఇక ట్రైలర్ మొదట్లో వచ్చిన “అమ్మాయికి గాంధీ పేరేంది?” అని మనవడు ప్రశ్నించడం, “ప్రపంచమంతా గొప్పగా పిలుచుకునే పేరుకి అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి ?” అంటూ తాత సమాధానం చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి సుకుమార్ కూతురు సుకృతి ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇక ఈ సినిమా జనవరి 24న థియేటర్లలోకి రాబోతోంది.
ఓవైపు చదువు, మరోవైపు యాక్టింగ్
ప్రస్తుతం సుకృతి ఓవైపు చదువుకుంటూ మరో వైపు సినిమాలపై ఫోకస్ చేస్తోంది. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, ఆమె ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటుంది. అంతేనా ఈ పాప మల్టీ టాలెంటెడ్. మరోవైపు దర్శకత్వం కూడా నేర్చుకుంటుంది.