Mahabubnagar District : మొక్కలకు నీళ్లు పోయడం మంచి పౌరుడి లక్షణం. మొక్కల్ని సంరక్షిస్తే.. అవి పెరిగి పెద్దవై మనకు ఉపయోగపడతాయి. ఇలా.. చాలా మాటలు మనకు స్పూర్తి నింపుతాయి. అలానే.. ఆ యువకుడు తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలవాలి అనుకున్నాడు. రోజూ మొక్కలకు నీళ్లు పోస్తూ.. బాధ్యతగా మెలిగాడు. కానీ.. చుట్టు పక్కల వాళ్లు, పోలీసులు మాత్రం ఆ యువకుడు చేసిన పనికి ఆశ్చరపోయారు. నువ్వెక్కడ మనిషివిరా బాబు అంటూ తలలు పట్టుకున్నారు. ఎందుకంటారా.. ఎందుకో.. ఈ కథనంలో తెలుసుకొండి.
ఓ యువకుడు తనకు దగ్గర్లోని సమాధుల మధ్యలోకి నీళ్లు తీసుకెళ్లి మొక్కలకు పోస్తున్నాడు. ఏదో ఓ రోజు అంటే ప్రకృతిపై ప్రేమ అనుకోవచ్చు, ఇంకో రెండు రోజులు అంటే మద్యం మత్తులో చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ.. చాన్నాళ్లుగా ఇదే పని. అతని తంతు అంతు బట్టని జనాలు కొన్ని రోజులు చూసి.. ఇక లాభం లేదని పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సమాధుల మధ్యలోని చెట్లకు రోజూ నీళ్లెందుకు పోస్తున్నాడనే అనుమానంతో పరిశీలించగా.. వారు షాక్ కు గురయ్యారు. మనోడు సామాన్యుడు కాదురోయ్.. అని నోరెళ్లబెట్టారు. ఎందుకంటే.. ఆ యువకుడు సమాధుల మధ్య నీళ్లు పోసేది.. గంజాయి మొక్కలకు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో జరగింది.
గంజాయి మార్కెట్లో దొరకడం కష్టంగా మారింది. పైగా.. రేట్లు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ బాధలన్నీ ఎందుకు.. మనకే గంజాయిని పండిస్తే పోలా అనుకున్నాడు. అంతే.. ఇంట్లో పెంచినా, పొలంలో పెంచినా దొరికిపోతాం.. అందుకే ఎవరికీ అనుమానం రాని చోటును ఎంచుకున్నాడు. శ్మశానంలో అయితే.. ఎవరికీ తెలియదని పథకం వేశాడు. ఇంకేముంది.. అనుకున్నట్లుగానే గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. రోజూ నీళ్లు పోయడంతో చుట్టు పక్కల వాళ్లకు అనుమానం రానే వచ్చింది. గుట్టుగా పోలీసుల చెవికి సమాచారం చేరవేశారు.
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన బాబ్జి అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇక్కడ కొన్ని నెలలుగా వెల్డింగ్ పనులు చూస్తూ పని చేస్తున్నాడు. గంజాయికి అలవాటు పడిన ఈ యువకుడు.. కొన్నుక్కుని తాగడం ఇబ్బందిగా మారడంతో ఏకంగా మొక్కల్ని పెంచేందుకు స్కెచ్ గీశాడు.
Also Read : భార్యా, కూతురు గొంతు కోసిన కసాయి.. అదే కారణమా..
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు శ్మశానం దగ్గరకు వెళ్లి చూడగా గంజాయి మొక్కలు కనిపించాయి. దాంతో.. ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఇలా కూడా చేసే వాళ్లున్నారా అని తెల్లమొహం వేయడం స్థానికుల వంతైంది. కాగా.. ఈ ఘటనలో గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎక్కడి నుంచి మొక్కల్ని తీసుకువచ్చాడనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఇతనేనా.. ఈ చుట్టు పక్కల ఇతనిలా ఇంకెవరైనా గంజాయి మొకల్ని పెంచడం, గంజాయి విక్రయాలు జరపడం చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసులు.. నిందితుడైన బాబ్జీని మిడ్జిల్ తహసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.