Premi Viswanath: ఆరనీకుమా.. ఈ దీపం.. కార్తీక దీపం. ఈ పాట ఇప్పుడు ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం కార్తీక దీపం సీరియల్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ పేర్లను ఇప్పుడే కాదు.. బుల్లితెరపై సీరియల్స్ ఉన్నన్ని రోజులు మర్చిపోలేరు. అంతలా వారు ప్రేక్షకుల మనస్సులో చోటు సంపాదించుకున్నారు.
ముఖ్యంగా వంటలక్క. ఆమె ఏడిస్తే.. అభిమానులు ఏడ్చారు. నవ్వితే.. సంబురాలు చేసుకున్నారు. మన భాష కాకపోయినా కూడా ఆమెను తెలుగింటి ఆడపడుచును చేశారు. అంతలా తెలుగువారి అభిమానాన్ని సంపాదించుకున్న నటి ప్రేమి విశ్వనాథ్. మలయాళ నటిగా ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది. కార్తీక దీపం సీరియల్ తో తెలుగుకు పరిచయమైంది ప్రేమి. తెలుగువారు ఒకరిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో..వంటలక్కపై చూపించే ప్రేమతోనే అర్థమైపోతుంది.
చిన్నా, పెద్ద, ముసలి ముతక.. చివరికి అబ్బాయిలు కూడా ఈ సీరియల్ చూడడం మొదలుపెట్టారు అంటే ఆమె వలనే. ఈ సీరియల్ ప్రేమికి అంత పేరు తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆమె .. కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ లో నటిస్తోంది. ఇక సీరియల్ యాక్టర్స్ లో ప్రేమినే అత్యంత పారితోషికం అందుకుంటున్న యాక్టర్ గా గుర్తింపు కూడా తెచ్చుకుంది.
ఇవన్నీ పక్కన పెడితే.. ప్రేమి విశ్వనాథ్ ఈ మధ్యనే తన కొడుకును పరిచయం చేసింది. ఆమెను చూసిన ఎవరైనా.. ఆమె కొడుకు ఎలా ఉంటాడని అనుకుంటారు. శౌర్య పాపలా స్కూల్ కు వెళ్తాడేమో అనుకుంటారు. కానీ, ప్రేమి కొడుకు మాత్రం జిమ్ లో బాడీ బిల్డర్. ఏంటి షాక్ అయ్యారా.. ? అవును.. మన వంటలక్క కొడుకు మాను బాడీ చూస్తే చిన్నపాటి బాహుబలి అని చెప్పొచ్చు.
వామ్మో.. ఏంటి వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మాను ప్రస్తుతం చదువుకుంటూనే.. ఇంకోపక్క బాడీ బిల్డర్ గా మారడానికి కష్టపడుతున్నాడు అంట. ప్రస్తుతం ఈ తల్లికొడుకుల ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి త్వరలో మాను.. హీరోగా ఏమైనా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.