Game Changer: రామ్ చరణ్(Ram Charan) తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ప్రముఖ డైరెక్టర్ శంకర్(Shankar)దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇటీవల మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేయడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు అదిరిపోతుంది అని ఇప్పటికే ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా ప్రతి ఒక్కరు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్లో అనుమతి..
దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే రేపు విడుదల కానున్న నేపథ్యంలో అప్పుడే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షో తో పాటు టికెట్ ధరల పెంపుపై కూడా అనుమతులు లభించిన విషయం తెలిసిందే. దీంతో అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ ధరల పెంపు అలాగే బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప2’ అని అందరికీ తెలుసు. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. అక్కడికి అల్లు అర్జున్ పోలీసులు పర్మిషన్ నిరాకరించినా.. ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం బెనిఫిట్ షో లతో పాటు టికెట్ ధరల పెంపుపై కూడా నిషేధం విధించింది.
అదనపు షోల పర్మిషన్ పై హైకోర్టు అసంతృప్తి..
అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎఫ్డిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు.. ఈ విషయంపై మరొకసారి రేవంత్ రెడ్డిని కలిసి టిక్కెట్ ధరల పెంపు పై అలాగే బెనిఫిట్ షో వేసుకునేలా అనుమతులు పొందాలని ప్రయత్నం చేస్తుండగా.. ప్రస్తుతం ఈ విషయం కాస్త హైకోర్టు వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై లాంచ్ మోషన్ ను హైకోర్టు అనుమతించింది. అయితే తెల్లవారుజామున వేసే అదనపు షోలకి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
రేపే తుది తీర్పు..
ఈ నేపథ్యంలోనే అదనపు షోలు అలాగే షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ, నియంత్రణకు సంబంధించిన ఆదేశాలను శుక్రవారం జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ముఖ్యంగా టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప 2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామని కూడా ఉన్నత న్యాయస్థానం తెలిపింది. మొత్తానికైతే గేమ్ ఛేంజర్ రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది? అని అటు చిత్ర బృందంతో పాటు ఇటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి పూర్తి సమాచారం లభించాలంటే.. రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇక ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.