Adithya 369 Re Release.. ఈ మధ్యకాలంలో గత రెండు మూడు సంవత్సరాలుగా రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోల సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న చిత్రాలను మళ్లీ థియేటర్లలో 4k వెర్షన్ లో రిలీజ్ చేసి అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా అభిమాన హీరో పుట్టినరోజు నాడు లేదా ఇతర సందర్భాలలో వారి చిత్రాలను విడుదల చేస్తూ మళ్ళీ ఆ అనుభూతిని పొందుతున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మొట్టమొదటిసారి వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ గా ‘ఆదిత్య 369’ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. బాలయ్య (Balakrishna ) హీరోగా, హీరో తరుణ్ (Tarun) చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఆదిత్య 369 మూవీ..
ఇకపోతే ఈరోజు మహాశివరాత్రి కావడంతో ఈ సందర్భంగా ‘ఆదిత్య 369’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్తో సహా ఒక పోస్ట్ షేర్ చేశారు. నేటి సాంకేతికలకు అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఈ సమ్మర్ స్పెషల్ గా మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలపడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ఈ ఆదిత్య 369 సినిమాని శ్రీనివాసరావు (Srinivas Rao) తెరకెక్కించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad), బాలసుబ్రమణ్యం(Bala Subrahmanyam)నిర్మించగా.. ఈ చిత్రానికి ఇళయరాజా (IleaRaja) అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అంతేకాదు ఈ సంగీతం ఈ సినిమా విజయానికి ఒక కారణం అయ్యిందని చెప్పవచ్చు.
రీ రిలీజ్ పై ఆదిత్య 369 డైరెక్టర్ కామెంట్స్..
ఇకపోతే 1991లో థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. ఈ మేరకు దీనిపై స్పందించిన డైరెక్టర్ మాట్లాడుతూ..” ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఈ సినిమాని డిజిటల్ 4K లో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాము. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని, ముఖ్యంగా నందమూరి అభిమానులను అలరించడానికి ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఒక గుర్తింపుతో పాటూ అద్భుతమైన పునాదిని ఇచ్చిన సినిమా ఇది. ఇప్పుడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడానికి పూర్తి సన్నహాలు చేస్తున్నాము” అంటూ తెలిపారు. అలాగే శ్రీదేవి మూవీస్ బ్యానర్ వారు అధికారికంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.