Vijay – Prashant Kishor : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తమిళనాడులో అగ్రకథానాయకుడిగా రాణిస్తున్న విజయ్ సైతం తన రాజకీయాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కజగం (టీవీకే) వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ తన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మహాబలిపురంలో తన పార్టీ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో.. 2026 ఎన్నికలకు తాను సిద్ధమని ప్రకటించిన విజయ్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. దీంతో.. ఈ సారి అక్కడి రాజకీయాల్లో సంచనల మార్పులకు అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా.. రాష్ట్రంలోని ద్రవిడ దిగ్గజ పార్టీలు తమిళగ వెట్రి కజగం పార్టీని సులువుగా తీసుకోవద్దనే సంకేతాన్నిచ్చినట్లైంది.
తాజా పరిణామాలతో వచ్చే ఎన్నికలకు టీవీకే గట్టిగానే ప్రిపేర్ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో తనదైన మార్క్ ప్రచారాన్ని నిర్వహించి.. అనేక విజయాలు సాధించిన ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో తమిళనాడులోని పార్టీలు ఆలోచనలో పడ్డాయి. కిషోర్ అండ్ టీమ్ ఇప్పటి నుంచి విజయ్ కు రోడ్‌మ్యాప్‌కు మార్గనిర్దేశం చేయునున్నారు. ఒక అనుభవం లేని పార్టీకి… అనుభవంతో కూడిన వ్యక్తులు, బృందాల మార్గనిర్దేశం.. కొంత ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న డీఎంకే నేతలు.. “గెట్ అవుట్ మోదీ” అంటూ ప్రచారం చేస్తుంటే.. బీజేపీ శ్రేణులు “గెట్ అవుట్ స్టాలిన్” అనే బోర్డులను ప్రదర్శిస్తున్నారు. వీరిద్దరకి కౌంటర్ గా “#గెట్ అవుట్” అనే సైన్ బోర్డుపై విజయ్ సంతకం చేశారు. ఇక్కడి నుంచే తన రాజకీయ వ్యూహాల అమలు మొదలైందనే ప్రచారం జరుగుతోంది. కేంద్రం, రాష్ట్రం అనే స్పష్టత ఇవ్వకుండా.. కేవలం గెట్ అవుట్ అనడం ద్వారా.. ఈ రెండు పార్టీలు “రహస్య కూటమి” అని ప్రచారం నిర్వహించనున్నారని తెలుస్తోంది. వీరిద్దరు.. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తూ, తమిళనాడు ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపింస్తున్నారు.
ప్రాంతీయ భావజాలానికి గట్టి విలువనిచ్చే తమిళనాడులో గతంలో సినిమాల నుంచి వచ్చిన వారు.. ముఖ్యమంత్రి పీఠాల్ని అధిరోగించిన చరిత్ర ఉంది. తమిళ సినీ దిగ్గజాలైన ఎంజీ రామచంద్రన్ – ఎంజీఆర్, జయలలిత అలా ముఖ్యమంత్రుల స్థానాల్ని అందుకున్న వారే. విజయ్ ఎంట్రీని ఇప్పుడు.. వారితో పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. మరోవైపు.. అదే తమిళనాడు నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పూర్తిగా కనుమరుగైన ఉదాహరణలు ఉన్నాయంటూ.. ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు. శివాజీ గణేషన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు.. పార్టీలు స్థాపించి నడిపించలేకపోయారు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ అయితే.. అసలు పార్టీని ఏర్పాటుకు ముందే తలొగ్గారు.
విజయ్ పార్టీకి ఎవరితో పొత్తు
పార్టీని ప్రకటించినప్పటి నుంచి వీలైనప్పుడల్లా రాష్ట్రంలోని రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్న విజయ్.. డీఎంకే, బీజేపీ పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసమర్థ పాలన, శాంతిభద్రతలు, వంశపారంపర్య రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు. అదే తీరుగా ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనపై బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో.. విజయ్.. AIADMK తో పొత్తుకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి టీవీకే ఇంకా ఏ ప్రధాన పార్టీతోనూ పొత్తు పెట్టుకోనప్పటికీ, విజయ్-ఏఐఏడీఎంకే పొత్తు డీఎంకేకు తీవ్రమైన సవాలుగా మరే అవకాశం ఉందంటున్నారు. జయలలిత మరణం తర్వాత అంతర్గత కలహాలు, నాయకత్వ వివాదాలతో బలహీనపడిన ఏఐఏడీఎంకే, ఎన్నికలకు ముందు యాక్టీవ్ రాజకీయాలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల పొత్తుపై తమిళనాడులో ఊహాగానాలు ఉపందుకున్నాయి.
Also Read : Cm Stalin – NEP : మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న తమిళనాడు – అసలు వారికొచ్చిన సమస్యేంటి