Liger : పూరి జగన్నాథ్ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం లైగర్. ఆయనతో పాటు కరణ్ జోహార్, అజయ్ మెహతా కూడా సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో రిలీజైన లైగర్ డిజాస్టర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ భారీగా నష్టపోయారు. చాలా మంది బయ్యర్స్ ఈ నెల 27న పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని నిశ్ఛయించుకున్నారు. ఈ విషయం పూరి జగన్నాథ్ వరకు వెళ్లింది. ఆయన బయ్యర్స్‌పై సీరియస్‌గా ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన ఆడియో కాల్ నెట్టింట లీకై వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ పూరి జగన్నాథ్ బయర్స్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే …
‘‘నువ్వు పంపించిన లెటర్ చూశాను. శోభన్ బాబు కూడా నాకు అదే లెటర్ పంపింపాడు. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవ్వరికీ తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను ఎందుకు? పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని. నేను ఆల్ రెడీ బయ్యర్స్‌తో మాట్లాడాను. ఒక అమౌంట్ ఇస్తానని చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఒక నెల సమయం అడిగాను. ఎందుకంటే నాకు రావాల్సింది ఉంది. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇస్తున్నాం. పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తీయాలని చూస్తే ఒక రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్‌కి నాకు సంబంధం ఏంటి? ఇక్కడ అందరం గ్యాబ్లింగ్ చేస్తున్నాం. పేకాట ఆడుతున్నాం. కొన్ని ఆడతాయి.. కొన్ని పోతాయ్. పోతున్నాయి.. నేను ఎవరినైనా అడుగుతున్నానా. వీళ్లు మగాళ్లు కాదు. ఒక్కడు లేడు ఇక్కడ. అదే సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చేయటానికి నానా సంకలు నాకాలి.
పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. బయ్యర్స్ అసోసియేషన్ నాకు దాన్ని వసూలు చేసి పెడతదా! లేదు కదా. నా సినిమా కొన్నవాళ్లు అందరూ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. పెద్ద ప్రొడ్యూసర్స్. మా శోభన్ బాబు అయితే సినిమాలకు కోట్లు అప్పు ఇస్తుంటాడు. ఎగ్జిబిటర్ అంటే ఎవడు? థియేటర్ ఓనర్. థియేటర్ ఓనర్ అంటే డబ్బులున్నట్లే కదా. ఇక్కడ ఎవడు తక్కువ కాదు. అందరూ గొప్పొళ్లే. ఓ సినిమా పొతే వీళ్లలో ఎవడు రోడ్డు మీదకి రాడు. అయినా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు’’ అన్నారు.
ఇప్పుడు నెట్టింట ఇలా పూరి గొంతుతో ఆడియో తెగ వైరల్ అవుతోంది. మరి లైగర్ సెటిల్‌మెంట్ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో చూడాలి.