Mohan Babu @50years: మోహన్ బాబు (Mohan Babu).. ఇప్పట్లో అయితే ఈయన నటన కనుమరుగయ్యిందని చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు డైలాగ్స్ చెప్పడంలో ఈయనను ఢీ కొట్టిన వారు లేరు. ఎంత పెద్ద డైలాగ్ అయినా.. ఎంత క్లిష్టమైనదైనా సరే అనర్గళంగా ఒక్కసారి విని చెప్పగలిగిన సామర్థ్యం ఈయనది. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా
‘డైలాగ్ కింగ్’ అని పిలుచుకుంటారు. అంతేకాదు ఈయన నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇక తెలుగు సినీ పరిశ్రమలో 50వ యేటలోకి అడుగుపెట్టారు మోహన్ బాబు. పాత్రల వైవిధ్యం, స్క్రీన్ ప్రజెన్స్ , పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం.. అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది అని చెప్పడంలో సందేహం లేదు.
స్వర్గం నరకం సినిమాతో హీరోగా ఎంట్రీ..
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. ఇండస్ట్రీకి పెద్దగా నిలిచిన దాసరి నారాయణరావు (Dasari Narayanarao) సహాయం ఒకవైపు తోడైతే, తన ప్రతిభ తనకు మరోవైపు నుంచి సహాయపడింది. అలా అన్నీ కలగలుపుకొని నేడు స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు. దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న సెలబ్రిటీస్ లో ఈయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఇకపోతే 1975 నుంచి 1990 వరకు విలన్ పాత్రలు చేశారు. ‘స్వర్గం నరకం’ సినిమాతో ఇండస్ట్రీకి హీరో గా పరిచయమైనా.. విలన్ పాత్రలతోనే టాప్ స్థానాన్ని దక్కించుకున్నారు.
హీరోగా నిలబెట్టిన చిత్రాలు..
ఇక 1990లో హీరోగా మారిన మోహన్ బాబు.. ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయనను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు చిత్రాలలో ఆయన నటించిన అనేక సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ముఖ్యంగా ఆయన నటించిన ఎన్నో తెలుగు చిత్రాలను తమిళ్, హిందీలో కూడా రీమేక్ చేయాగా.. అక్కడ కూడా భారీ విజయాలు అందించాయి. తద్వారా జాతీయ స్థాయి నటుడిగా పేరు దక్కించుకున్నారు మోహన్ బాబు
రాజకీయరంగంలో కూడా చెరగని ముద్ర..
మోహన్ బాబు సినిమాలపైనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. 1997లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ సినిమా, ఎన్టీ రామారావు (Sr.NTR) తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈసభ అటు సినిమా ఇటు రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయింది. సినిమా, రాజకీయ రంగంలోనే కాదు విద్యారంగంలో కూడా విశేష సేవలు అందించారు. శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ను 1992లో స్థాపించి వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అంతేకాదు గత మూడు దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తూ.. పేద విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
మహదేవ శాస్త్రీ గా మోహన్ బాబు..
సుదీర్ఘమైన కెరియర్లో ఎన్నో గౌరవ పురస్కారాలు కూడా అందుకున్నారు మోహన్ బాబు. 2007లో భారత ప్రభుత్వం అందించిన ‘పద్మశ్రీ’ తో పాటు 2016లో ‘ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డు కూడా అందుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం తన కొడుకు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో మోహన్ బాబు ‘మహాదేవ శాస్త్రీ’ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ఆయన కెరియర్లో మరో మైలురాయి కానుంది అని సమాచారం. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది.