Megastar: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి కన్నుమూశారు. దీని పై మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ‘తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలయజేశారు. ఎంతోమంది స్టార్ హీరోతో సినిమాలు చేసిన దర్శకుడు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి.. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. తన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని, గురువారం ఆ ఆసుపత్రిలోనే ఆమె కన్నుమూశారని తెలుస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ అభిమానులు మెహర్ రమేష్ సోదరి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
మెగాస్టార్, మెహర్ బంధుత్వం
మెహర్ రమేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన మెగా కుటుంబానికి చెందినవాడేనని అందరూ అనుకునేవారు. కానీ దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే మెగా కుటుంబంతో ఆయనకు ఉన్న బంధుత్వం గురించి బయటికి వచ్చింది. మెహర్ రమేష్ మరియు చిరంజీవి మధ్య ఉన్న బంధుత్వం గురించి చెప్పాలంటే, మెహర్ రమేష్ చిరంజీవి కజిన్ సోదరి కొడుకు అని టాక్ ఉంది. ఈ బంధుత్వం వల్లే చిరంజీవి మెహర్ రమేష్‌కు అవకాశాలు ఇచ్చారని కొందరు భావిస్తారు. ఇప్పుడు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను కూడా నాకూ సోదరే అని చిరు తన సంతాపాన్ని ప్రకటించారు. దీంతో.. వీరి బంధుత్వం పై ఓ అవగాహనకు వచ్చారు అభిమానులు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సత్యవతి మృతి పట్ల తన సంతాపాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సత్యవతి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తను చదువుకునే రోజుల్లో మాచర్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న సత్యవతి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లేవాళ్ళమని.. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సత్యవతి ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రకటనలో తెలిపారు.
చివరగా ‘భోళా శంకర్’
మెహర్ రమేశ్ టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కొన్ని ఫ్లాపుల వల్ల రేసులో వెనకబడిపోయారు. అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి తనకి అవకాశం ఇచ్చారు. చివరగా మెహర్‌తో కలిసి చిరు చేసిన సినిమా ‘భోళాశంకర్’. తమిళ్ సినిమా వేదాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.మెహర్ రమేశ్‌పై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
మెహర్ రమేశ్ సినిమాల గురించి
మెహర్ రమేశ్ తెలుగు మరియు కన్నడ సినిమాల్లో పనిచేశారు. 2002లో విడుదలైన “బాబీ” సినిమాలో మహేష్ బాబుతో కలిసి ఒక సహాయక పాత్రలో నటించాడు. తర్వాత అతను దర్శకుడిగా మారి, తన తొలి చిత్రంగా కన్నడలో “వీర కన్నడిగ” (2004) తీశాడు. తర్వాత టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రి (2008) సినిమాను ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడు. ఇక ప్రభాస్ హీరోగా తమిళ హిట్ సినిమా “బిల్లా” రీమేక్ చేశాడు. ఈ సినిమా మెహర్ రమేశ్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్స్‌కి ప్రశంసలు అందాయి. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో మరో శక్తి సినిమా చేశాడు. ఇది ఒక భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ చిత్రం. అయితే, ఈ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అక్కడి నుంచి వెంకటేష్ షాడో (2013), మెగాస్టార్ భోళా శంకర్ (2023) మెప్పించలేకపోయాడు మెహర్.