HKU 5 COV-2 Virus: చైనాలో మరో వైరస్ పుట్టింది. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తగా కనుగొన్న కరోనా వైరస్ వేరియంట్ కు HKU 5 COV-2గా నామకరనం చేశారు. ఈ వైరస్ మరో ప్రపంచ మహమ్మారికి కారణం అవుతుందనే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా పుట్టిన వుహాన్ లోనే ఈ వైరస్ పుట్టినట్లు వెల్లడించారు. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తల బృందం ప్రచురించిన తాజా పరిశోధన నివేదికలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ పరిశోధనను బ్యాట్ ఉమెన్ అయిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ జెంగ్లీ షీ లీడ్ చేశారు. 2003లో SARS మహమ్మారి, 2021లో MERS, 2019లో COVID-19 మహమ్మారి మూలాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలలో ఆమె ఒకరు.
ఇంతకీ చైనా పరిశోధన బృందం నివేదికలో ఏం చెప్పారంటే?
తాజాగా వ్యూహాన్ శాస్త్రవేత్తల పరిశోధన నివేదిక సెల్ మెడికల్ జర్నల్ లో ప్రచురించబడింది. ఈ అధ్యయనంలో COVID-19 వైరస్ మాదిరిగానే HKU5–CoV–2 కూడా ACE2 గ్రాహకాల ద్వారా మానవ కణాలలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త వైరస్ కూడా మొదట గబ్బిలాలలో కనుగొనబడింది. అయితే, ఈ వైరస్ ఇప్పటి వరకు మానవులలో గుర్తించినట్లు నివేదికలో వెల్లడించలేదు.
భారత వైద్య నిపుణులు ఏం అంటున్నారంటే?
భారత ఆరోగ్య నిపుణులు HKU5 COVI వైరస్‌లు కణాలలోకి ప్రవేశించడానికి ప్రత్యేకమైన పద్ధతులను అవలంభించినట్లు వెల్లడించారు. HKU5 – COVI 2 మానవ శరీరంలోకి ప్రవేశించడానికి ACE2 గ్రాహక ప్రోటీన్ పై దాడి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పద్దతి చాలా ప్రమాదకరమైన విషయం అని హెచ్చరిస్తున్నారు. HKU 5 – COVI 2 వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) ను పోలి ఉంటుందని డాక్టర్ సంజీవ్ బగై వెల్లడించారు. అయితే, వైరస్ ఎటువంటి పెద్ద ఉత్పరివర్తనలకు గురికాకపోవడంతో అది మహమ్మారిగా మారే అవకాశం లేదని ఆయన అన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ లోని అసోసియేట్ ఫెలో డాక్టర్ ఉపలబ్ద్ గోపాల్, ACE2 గ్రాహకాలను ఉపయోగించడంలో HKU 5 COVI 2 వైరస్ SARS COV వైరస్ లా సమర్థవంతంగా పని చేయడం లేదన్నారు. భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పినప్పటికీ, కొత్త వైరస్ యొక్క లక్షణాలను గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని డాక్టర్ గోపాల్ అన్నారు.
కరోనా దెబ్బతో ప్రపంచం అతలాకుతలం అయిన నేపథ్యంలో కొత్త కరోనా వైరస్ పైనా ప్రజల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. చైనా చెప్పే మాటలు, నిజ జీవితంలో పూర్తి విరుద్ధంగా ఉంటాయి. అయితే, భారత శాస్త్రవేత్తలు ఈ వైరస్ గురించి ఆందోళన ఆసరం లేదని చెప్పడం ఉపశమనం కలిగించే అంశంగా భావించవచ్చు. అయినప్పటికీ ఈ వైరస్ గురించి ఎప్పటికప్పుడు పరిశోధనలు జరపడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
Read Also: ఉల్లి గడ్డలను ఇలా అస్సలు తినకండి, లేదంటే క్యాన్సర్ రావడం పక్కా!