Unstoppable Season 4 Trailer: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు.. అన్ స్టాపబుల్ అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడన్న విషయం తెల్సిందే. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. బాలయ్య విసిరే ఛలోక్తులు, సెటైర్లు, కౌంటర్లు.. సెలబ్రిటీలతో ఆడించే ఆటలు ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. ఇప్పటికే మూడు సీజన్స్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి రానున్నాడు.
నేడు దసరా పండగ సందర్భంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది బాలయ్య పండుగ అంటూ వచ్చిన ఈ ట్రైలర్ లో బాలకృష్ణ సూపర్ హీరోలా కనిపించాడు. నిజం చెప్పాలంటే అన్ స్టాపబుల్ కేవలం సెలబ్రిటీ టాక్ షో మాత్రమే కాదు. ఈ షో చివర్లో తమ కష్టంతో పైకి వచ్చినవారిని, కష్టాల్లో ఉన్నవారిని స్టేజిమీదకు పిలిచి వారికి ఎంతోకొంత సాయం చేస్తాడు బాలయ్య. ఇప్పుడుఈ ట్రైలర్ లో కూడా అలాంటి కథనే చూపించారు.
ఒక చిన్న గ్రామం.. అందులోని ప్రజలను పట్టిపీడిస్తున్న రాక్షసులు. కనీసం పండుగకు కొత్త బట్టలు, స్వీట్స్ కూడా చేసుకోలేని పరిస్థితి. ఎవరో వస్తారని, తమకు వెలుగు తెస్తారని ఎదురుచూస్తూ ఉంటారు. ఆ సమయంలోనే సూపర్ హీరోగా బాలయ్య వస్తాడు. విలన్స్ ను చితకబాది.. ఆ గ్రామంలోకి వెలుగును తీసుకొస్తాడు.
ఇక ఆ వెలుగు చూసిన ఒక చిన్నారి ఇదేం పండగ అమ్మ అని అడిగితే.. ఇది బాలయ్య పండుగ అని చెప్పుకొస్తుంది. ఇక అలా యానిమేటెడ్ సూపర్ హీరో.. అన్ స్టాపబుల్ సెట్ లో బాలయ్యగా మారిపోతాడు. ఎప్పటిలానే తన వాక్చాతుర్యంతో బాలయ్య మెప్పించాడు.
గుండెల్లో పెట్టుకున్నారు.. ఘనమైన కీర్తిని అందించారు. జనరేషన్ మారినా మన మధ్య ఉన్న ఎమోషన్ మారదని మళ్లీ రుజువు చేస్తున్నారు. వేడుక చేసుకొనే సమయం వచ్చేసింది. గేరు మారుద్దాం.. ప్రశ్నలలో కొంచెం ఘాటు పెంచుద్దాం.. వచ్చే అతిధులకు మర్చిపోలేని ఆతిథ్యం ఇద్దాం.. అన్ స్టాపబుల్ సీజన్.. ప్రతి ఎపిసోడ్ పండగలా చేద్దాం.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. కాదు మారి తీరాలా అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి.
అక్టోబర్ 24 న ఈ సీజన్ గ్రాండ్ గా లాంచ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మొదటి ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడని సమాచారం. మరి ఈసారి బాలయ్య ప్రశ్నల ఘాటు ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.