Naveen Polishetty: కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నవీన్.. ఆ తరువాత జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఇక గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ సినిమా తరువాత నవీన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే గత కొన్ని నెలలుగా నవీన్ పత్తా లేకుండా పోయాడు. కొన్నిరోజుల క్రితం నవీన్.. తనకు యాక్సిడెంట్ అయ్యినట్లు చెప్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉంటున్నాడని సమాచారం.
ఇక ఇవన్నీ పక్కనపెడితే.. నవీన్ పెళ్ళికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమెరికాలో నవీన్ పోలిశెట్టి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని, కొన్నేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమించిన ఈ హీరో.. అక్కడే ఆమెను వివాహం చేసుకొని సెటిల్ అయ్యాడని వార్తలు వినిపించాయి. ఇక ఈ రూమర్స్ .. నవీన్ వరకు వెళ్లడంతో అతను ఈ పుకార్లపై స్పందించాడు.
” ఈ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు ఇంకా పెళ్లి జరగలేదు. నా పెళ్లి ఫిక్స్ అయితే కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో నవీన్ పోలిశెట్టి పెళ్లి వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం చేతి గాయంతో బాధపడుతున్న నవీన్ పోలిశెట్టి.. దాని నుంచి పూర్తిగా కోలుకున్నాకా తన తదుపరి సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నాడు.