The Raja Saab: కొత్త ఏడాది రావడం జరిగింది.. ఇప్పటికే ఒక నెల పూర్తికావడం కూడా జరిగింది. ఇక గత నెలలో ఎన్ని సినిమాలు వస్తే.. ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో కూడా అందరికీ తెల్సిందే. ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిన సినిమాలు.. అసలు రిలీజ్ అవుతుందా.. అన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని హిట్స్ అందుకున్నాయి.. మరికొన్ని ప్లాప్స్ అందుకున్నాయి. ఇక ఇంకో పది రోజుల్లో ఫిబ్రవరి కూడా వెళ్ళిపోతుంది. ఈ నెలలో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లు ఏమి లేకపోవడంతో ప్రేక్షకుల చూపు అంతా సమ్మర్ మీదనే ఉంది.
ఇండస్ట్రీకి సంక్రాంతి ఎంత ముఖ్యమో.. సమ్మర్ కూడా అంతే ముఖ్యం. రికార్డ్ కలక్షన్స్ రాబట్టాలి అంటే అయితే పండగలు అయినా ఉండాలి.. లేకపోతే సెలవులు అయినా ఉండాలి. అందుకే మేకర్స్.. ఎప్పుడైనా ఈ రెండు సమయాల్లోనే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాలు ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
చిరంజీవి, రవితేజ, ప్రభాస్.. ఇలా సీనియర్ హీరోలందరూ సమ్మర్ ను వాడేయడానికి రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. బింబిసార సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఇప్పటివరకు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అందుకోలేని రికార్డ్ ను ఇచ్చి.. ఒక మంచి హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి కాన్సెప్ట్ తో విశ్వంభర ఉంటుందని టాక్ నడిచినా.. ఆ కథతో రావడం లేదని వశిష్ఠ క్లారిటీ ఇవ్వడంతో సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అన్ని సెట్ అయితే ఈ సంక్రాంతి బరిలో చిరు దిగేవాడే. కానీ, చరణ్ గేమ్ ఛేంజర్ కోసం తన సినిమాను కొద్దిగా ముందుకు తీసుకెళ్లాడు. అందులోనూ విఎఫ్ఎక్స్ కోసం బాగా కష్టపడుతుండడంతో సినిమా ఆలస్యం అయ్యిందని టాక్. ఇక అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర వస్తే జూన్ 27 ను కానీ, జూలై 11 న కానీ వస్తుందని అంటున్నారు.
చిరు కాకుండా సమ్మర్ లో మాస్ మహారాజ రవితేజ రంగంలోకి దిగుతున్నాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూపోయే హీరోల్లో రవితేజ ముందు ఉంటాడు. ఏడాదిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసే హీరో కూడా ఆయనే. గతేడాది మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులకు ముందు వచ్చాడు. అది ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయినా నిరాశపడకుండా ఈసారి మాస్ జాతర అంటూ రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన కుర్ర హీరోయిన్ శ్రీలీల రెండోసారి జత కడుతుంది. రవితేజ అంటేనే మాస్. అలాంటింది అంతే మాస్ తో టైటిల్ పెట్టారంటే.. ఇంకే రేంజ్ జాతర ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మే 9 న మాస్ జాతర రిలీజ్ అవుతుందని మేకర్స్ మొదట ప్రకటించారు. వేసవి కాలం సెలవులు.. రవితేజ సినిమా .. ప్రేక్షకులు ఇంకేం కావాలి.
Allu Arjun: చరణ్ అన్ ఫాలో గొడవ.. బన్నీ ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్కరు ఎవరో తెలుసా.. ?
ఇక రవితేజతో పాటు నేను కూడా మే 9 నే వస్తానంటున్నాడు తమ్ముడు నితిన్. గత కొన్నేళ్లుగా భారీ విజయం కోసం నితిన్ కష్టపడుతున్న విషయం తెల్సిందే. వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు అన్నమాటే కానీ, ఒక్క హిట్ కూడా దక్కింది లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నితిన్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కాంతార బ్యూటీ సప్తమి గౌడ నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటిస్తోంది. తమ్ముడు టైటిల్ తో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంచి హిట్ ను అందుకున్నాడు. అదే టైటిల్ ను నితిన్ వాడేస్తుండడంతో.. ఒక మోస్తరుగా పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రవితేజ వస్తున్న అదే రోజున నితిన్ కూడా రావడానికి సిద్దమయ్యినట్లు తెలుస్తోంది.
అన్ని సినిమాలు సెట్ అయ్యాయి.. అసలు సమ్మర్ కు రావాల్సిన సినిమా ఏది.. ? అని కంగారుపడుతుంటే.. కంగారుపడండి పర్లేదు. ఎందుకంటే.. ప్రభాస్ సినిమా ఎప్పుడు వాయిదాలు లేకుండా రాదు కాబట్టి. ఆదిపురుష్ సమయంలోనే ప్రభాస్ అభిమానులకు మాట ఇచ్చాడు. ప్రతి ఏడాది మినిమమ్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తాను అని.. చెప్పినట్లే డార్లింగ్ మాట మీద నిలబడుతున్నాడు. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న డార్లింగ్.. ది రాజాసాబ్ తో డిసెంబర్ లోనే వస్తాడు అనుకున్నారు. కానీ, మేకర్స్ మాత్రం ఏప్రిల్ 10 న రాజాసాబ్ వస్తున్నాడు అని చెప్పడంతో.. ఓకే కూల్ అని వెయిట్ చేస్తూ వస్తున్నారు.
మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఏప్రిల్ లో సినిమాలు అంటే మాములుగా లేవు. అదే రోజు జాక్ అంటూ సిద్దు వస్తున్నాడు. ఏప్రిల్ 25 న కన్నప్పతో విష్ణు వస్తున్నాడు. ఇన్ని సినిమాలు ఉన్నా.. రాజాసాబ్ రాకను ఎవరు ఆపలేరు కానీ, మేకర్సే వాయిదా వేయనున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ.. ఏప్రిల్ లో సినిమా పెట్టుకొని ఇప్పటివరకు ఒక అప్డేట్ లేదు.. ఒకప్రమోషన్ లేదు. అక్కడే అర్థమైపోయింది రాజాసాబ్ వాయిదా పడిందని.
సరే ఆ రోజు వాయిదా పడినా.. ఏరోజు వస్తుంది అనేది క్లారిటీ లేదు. మార్చి నుంచి మొదలుకొని జూన్, జూలై వరకు కూడా రాజాసాబ్ కు డేట్ దొరకలేదని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియదు కానీ, డార్లింగ్ సినిమాకు డేట్ దొరకకపోవడం ఏంటి చెప్మా అంటే.. ఇన్ని సినిమాలను దాటుకొని ఒక డేట్ ఫిక్స్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక ఇది దాటింది అంటే చివరకు ఆగస్టుకు మాత్రమే. అంటే ఒకవేళ ఏప్రిల్ 10 లేకపోతే.. రాజాసాబ్ వచ్చేది చివరగా ఆగస్టులోనే అన్నమాట. అయితే ఇది కూడా ఫిక్స్ అవుతుందా.. ? లేదా.. ? అనేది కూడా డౌటే. అంటే ఈ ఏడాదిలో డార్లింగ్ ను చూడాలంటే ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే.