Tejas Fighter Jet Updates : భారత వైమానిక దళానికి కావాల్సిన స్వదేశీ యుద్ధ విమానాల తయారీ, అప్ గ్రేడ్ విషయంలో ప్రభుత్వం సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)పై తనకు నమ్మకం లేదని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ సంచల వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇచ్చే ఏళ్లు గడుస్తున్నా, డెలివరీ చేయకపోవడంపై గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్.. మరోసారి ఈ ప్రభుత్వ రంగ సంస్థ విధానాలు, పనితీరుపై విమర్శలు గుప్పించారు. 1980లలో మిగ్-21 విమానాలను భర్తీ చేసేందుకు చేపట్టిన స్వదేశీ యుద్ధ విమానాల ప్రక్రియ.. ఇప్పటికీ ముగియకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎప్పటికప్పుడు హిందుస్థాన్ ఎరోనాటిక్స్ పై తన నమ్మకం క్షీణిస్తూనే ఉందని అన్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారుల ఆందోళనలను తగ్గించి, మరింత నమ్మకంగా ఉంచాలని కోరారు. మాతృభూమి రక్షణ విషయంలో తనకు HAL పనితీరు పట్ల నమ్మకం లేదని, అలా జరగడం చాలా తప్పని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఏరో ఇండియా 2025 ప్రారంభమైన నేపథ్యంలో.. ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యాలు చేశారు. దేశీయ వైమానిక దళ అవసరాలు, ఆందోళనలు ఏమిటో తాను వివరించగలనన్న ఏపీ సింగ్.. ప్రభుత్వ రంగ సంస్థపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో HAL సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
1998 అణు పరీక్షల ఆంక్షలే కారణం
హిందుస్థాన్ ఎరోనాటిక్స్ పై IAF చీఫ్ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే అనేక సార్లు ఆయన ఈ సంస్థ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. పదేపదే ఈ సంస్థ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న ఆయన తీరుతో.. సంస్థ స్పందించింది. 1998 అణు పరీక్షల తర్వాత భారత్ పై విధించిన ఆంక్షలే స్వదేశీ విమానాల ఉత్పత్తిలో ఆలస్యానికి కారణమని HAL పేర్కొంది. 1984లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన గడువు, నిర్దేశించుకున్న అదనపు ఆర్డర్లను సంస్థ కచ్చితంగా చేరుకుంటుంది అని సీఎండీ డీకె సునీల్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎయిర్ చీఫ్ మార్షల్ నుంచి సైతం ఇదే తరహాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మార్చి చివరి నాటికి IAFకి కనీసం 11వ తేజస్ – MK-1A యుద్ధ విమానాన్ని అందజేస్తామని తెలిపింది. ఇది.. భారత వైమానిక దళంతో కుదుర్చుకున్న 83 విమానాల సరఫరా ఒప్పందంలో భాగంగా అందించనున్న యుద్ధ విమానంగా తెలిపింది.
సంస్థ స్పందన ఇదే..
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అనేక మంది శాస్త్రవేత్తలు.. HAL సంస్థ తేజస్ విమానాన్ని తన బ్రాండ్ ఐటమ్ గా చూస్తుందని చెబుతున్నారు. అయితే.. 2014 తర్వాత మేక్-ఇన్-ఇండియా ప్రాజెక్టులో భాగంగా పెరిగిన ఒత్తిడితోనే సంస్థ ఈ విమానాల సరఫరా, అభివృద్ధిలో కీలకంగా పురోగతి సాధించిందని అనేక మంది అభిప్రాయపడుతుంటారు. కాగా.. వైమానిక దళ అధిపతి నుంచి పదే పదే వస్తున్న విమర్శలపై.. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సునీల్ స్పందించారు. ఈ ఆలస్యానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. 1998లో అణు పరీక్ష తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి ఎదుర్కొన్న ఆంక్షలను ప్రస్తావించారు. వాటి కారణంగానే.. తాము అన్ని విడిభాగాలను మొదటి నుంచి పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందని తెలిపారు. తేజస్ విమానంలో చాలా పురోగతి జరిగిందని తెలిపిన ఆయన.. జాప్యాలు కేవలం సోమరితనం వల్ల మాత్రమే జరగవని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో వైమానిక దళ అధిపతి ఆందోళన అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దుల్లో స్క్వాడ్రన్ బలం తగ్గుతోందనే ఆందోళన వారిలో ఉందని, కానీ.. చెప్పిన సమయానికి ఆర్డర్లను సిద్ధంగా ఉంచుతామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. వివిధ స్థాయిలలో జరిగిన బహుళ సమావేశాలలో ఇప్పటికే ఈ విషయాన్ని వారికి తెలిపినట్లు వెల్లడించారు.