Modi Foreign Tour : ప్రధాని మోదీ మూడురోజుల ఫ్రాన్స్ పర్యాటన ముగిసింది. వివిధ కార్యక్రమాలు, చర్చలతో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ లోని మార్సెయిల్ నుంచి వాషింగ్టన్ డీసీకి పయనమైయ్యారు. మోదీ విమానం ఎక్కే ముందు వరకు ఆప్యాయంగా మాట్లాడుకున్న ఇద్దరు నేతలు.. గతానికి భిన్నంగా అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మెక్రాన్.. ఎయిర్పోర్టు వరకు వచ్చి మోదీకి వీడ్కోలు పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఆయా వేదికల నుంచి భారత్ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని వివరించారు.
తన పర్యటన ముగిసిన సందర్భంగా.. ట్విట్టర్ లో ప్రత్యేక పోస్టు పెట్టిన ప్రధాని మోదీ.. “థ్యాంక్యూ ఫ్రాన్స్! ఫలప్రదంగా పర్యటన ముగిసింది. అక్కడ నేను Al, వాణిజ్యం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాల వంటి కార్యక్రమాలకు హాజరయ్యాను. అధ్యక్షుడు @Emmanuel Macron, ఫ్రాన్స్ ప్రజలకు కృతఙ్ఞతలు” అంటూ పేర్కొన్నారు. ఫ్రెంచ్ లోనూ ట్వీట్ చేశారు.
Thank you France!
A productive visit concludes, where I attended programmes ranging from AI, commerce, energy and cultural linkages.
Gratitude to President @EmmanuelMacron and the people of France. pic.twitter.com/dLkzPdJOsz
— Narendra Modi (@narendramodi) February 12, 2025
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOలు హాజరైన AI యాక్షన్ సమ్మిట్ కు సహ అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు మెక్రాన్ తో జరిగిన సమావేశంలో.. భారత్ – ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం రూపొందించిన 2047 హారిజన్ రోడ్ మ్యాప్(Horizon roadmap) పై సమీక్షించారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2047 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఇరు దేశాలు “హారిజోన్ 2047” రోడ్‌మ్యాప్‌ను రూపొందించాయి. దీని లక్ష్యం రాబోయే 25 ఏళ్ల పాటు పరస్పరం సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం.
ప్రధాని పర్యటన సాగిందిలా!
అగ్రనేతల సమావేశం తర్వాత ఫ్రాన్స్ లో తొలి భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఇద్దరు నాయకులు చారిత్రాత్మక ఫ్రెంచ్ నగరమైన మార్పెయిల్ కు వెళ్లారు. ఫ్రాన్స్ సహా భాగస్వామ్య దేశాల కన్సార్టియంలో భారతదేశం సభ్యుడిగా ఉన్న అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ప్రాజెక్టును సందర్శించారు.
అలాగే.. ఈ పర్యటనలో మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికుల సమాధులున్న 0మజార్స్ యుద్ధ స్మశాన వాటికను సందర్శించిన ప్రధాని మోదీ.. అక్కడ అమరులైన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు.
అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ
ఫ్రాన్స్ పర్యటన విజయవంతం అయిన తర్వాత ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు అమెరికాకు అధికారిక పర్యటన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షత చేపట్టిన తర్వాత మోదీ మొదటి పర్యటన కావడం, ఈ ఇరువురు నేతల మధ్య మంచి సంబంధాలున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే.. అక్రమ వలసదారుల పేరుతో పెద్ద సంఖ్యలో ఇండియన్లను తిప్పి పంపిస్తున్న తరుణంలో.. అక్కడి భారతీయలకు మోదీ పర్యటన అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాంతో.. మోదీ అమెరికా టూర్ పై అనేక అంచనాలు నెలకొన్నాయి.
భారత్-అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ట్రంప్ నతో కలిసి ఆయన మొదటి పదవీకాలంలో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ.. ఈ పర్యటన అప్పటి లక్ష్యాల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సప్లై చైన్.. వంటి విభాగాల్లో మరింత లోతుగా ఎజెండాను అభివృద్ధి చేసేందుకు ఈ పర్యటన ఉపకరిస్తుందన్నారు. భారత్ – అమెరికా పరస్పరం ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించుకుంటూ.. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్ రూపొందిస్తామంటూ ప్రకటించారు.