Jani master:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్(Jani master)పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి. ముఖ్యంగా తన వద్ద లేడీ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న అమ్మాయి.. తనపై లైంగికంగా దాడి చేశాడని, మైనర్ గా ఉన్నప్పటి నుంచే తనతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఈ ఘటన నార్సింగ్ పరిధిలోకి రావడంతో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో భాగంగానే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసుతో పాటు బాధిత యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఈ పని చేస్తున్న కారణంగా పోక్సో చట్టం కింద కూడా కేస్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు.
ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు..
ఇదిలా ఉండగా జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అంతేకాదు అందులో పలు కీలక అంశాలు కూడా చేర్చారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ.. మహిళ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇప్పుడు ఆమె మాటలు నిజమేనని తేల్చారు పోలీసులు.
ఎఫ్ఐఆర్ లో యువతి చెప్పిన మాటలివే..
బాధిత యువతి 2017లో ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యారని, ఆ తర్వాత ఆయన టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలని తనకు ఫోన్ కాల్ వచ్చింది అని తెలిపింది. వారు కోరడంతో 2019లో జానీ మాస్టర్ టీం లో జాయిన్ అయ్యిందట. ఇక తర్వాత అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం చెన్నై, ముంబై, హైదరాబాదు సహా పలు నగరాలకు వెళ్లేవారట ఇక అక్కడ స్టే చేయడానికి హోటల్ బుక్ చేస్తే ఆ సమయంలో తనపై దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అత్యాచారం కూడా చేశాడని, గాయపరిచాడని బాధిత యువతి పోలీసుల ముందు తన బాధను వెళ్ళబుచ్చింది. దీనికి తోడు మతం మార్చుకోమని తనను చిత్రవధకు గురిచేసాడట. లైంగిక దాడికి పాల్పడినట్లు ఎవరికైనా చెబితే భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించినట్లు బాధిత యువతి తెలిపింది.జానీ మాస్టర్ తనకు పరిచయమైన రోజు నుంచి చిత్ర వరకు గురిచేసాడని తన ఫిర్యాదులో తెలిపింది. ముఖ్యంగా మణికొండ లో ఉన్న తన ప్లాట్ కి అర్ధరాత్రిలు వచ్చి హింసించేవాడు అంటూ కూడా ఆమె తెలిపింది. ఇక ఇప్పుడు ఈ విషయం నిజమేనని పోలీసులు తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.