Ram Gopal Varma: తెలుగు సినిమా ఈ స్థాయికి చేరిందంటే.. దానికి చాలావరకు క్రెడిట్ దర్శకుడు రాజమౌళికే దక్కాలి. అసలు రీజియనల్ సినిమాలు కనీసం రూ.10 కోట్ల కలెక్షన్స్ అయినా సాధించగలవా అని సందేహంలో ఉన్న సమయంలో ఆయన ఏకంగా ఈ నెంబర్‌ను రూ.1000 కోట్లకు పెంచాడు. దీంతో రాజమౌళి బాటలోనే మరెందరో దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేయడం, హిట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇప్పటికీ రాజమౌళి చేసిన సాహసాన్ని అందరూ గుర్తుచేసుకుంటూ ప్రశంసిస్తారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా తను అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో దర్శక ధీరుడిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అది విని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మన అదృష్టం
‘‘తెలుగు సినిమా సక్సెస్ అనేది ఒక్క ఏడాలో కొలిచేది కాదు. ఒక సినిమా తెరకెక్కించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. ఏడాదికి 150 చిత్రాలు తెరకెక్కిస్తే అందులో కొన్ని మాత్రమే పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మరి అదే రేంజ్‌లో సక్సెస్, అటెన్షన్ రానివారి పరిస్థితి ఏంటి.?’’ అంటూ 2024లో సక్సెస్ సాధించిన సినిమాల గురించి ప్రస్తావించారు ఆర్జీవీ. ఆ తర్వాత తెలుగు సినిమాపై రాజమౌళి ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో చెప్పుకొచ్చారు. ‘‘మొత్తం తెలుగు సినిమా ఈ క్రెడిట్‌ను తీసుకోకూడదు. కేవలం ఒక్క మనిషి మాత్రమే తీసుకోవాలి. తనే రాజమౌళి. తను తమిళ సినిమావాడు అయ్యిండొచ్చు, మలయాళం, గుజరాతీ.. ఇలా ఏ భాష సినిమావాడు అయినా అయ్యిండొచ్చు. కానీ అదృష్టంకొద్దీ తను తెలుగు సినిమావాడు అయ్యాడు’’ అన్నారు ఆర్జీవీ.
Also Read: అక్షయ్ కుమార్‌పై ట్రోల్స్.. అయినా ఇలాగే ఉంటానంటున్న హీరో, ఎందుకంత మొండితనం.?
అవి సరిపోవు
రాజమౌళి.. ‘బాహుబలి’ని తెరకెక్కించి ఒక బెంచ్‌మార్క్ క్రియేట్ చేశారని అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా కేవలం గ్రాండ్‌గా తెరకెక్కించడం మాత్రమే కాకుండా గ్రాండ్‌గా తెరకెక్కించిన సినిమాల బడ్జెట్‌ను లాభాలతో రికవర్ చేయవచ్చని కూడా చూపించారని తెలిపారు. ‘బాహుబలి’ తర్వాత అదే రేంజ్‌లో సక్సెస్‌ను తీసుకురావాలని ఎంతోమంది మేకర్స్ కష్టపడ్డారు. కానీ అదే రేంజ్‌లో రిజల్ట్స్ చూపించలేక ఫఎయిల్ అయ్యారు. ప్రేక్షకులను మెప్పించాలంటే భారీ ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండ్ విజువల్స్, భారీ సెట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటే సరిపోదని ‘బాహుబలి’ నిరూపించిందని అన్నారు. ‘మగధీర’ కూడా రాజమౌళి (Rajamouli) కెరీర్‌లో రిస్క్ తీసుకొని చేసిన సినిమానే అని గుర్తుచేసుకున్నారు ఆర్జీవీ.
కాన్ఫిడెన్స్ ఇచ్చాడు
‘‘మేకర్స్ అనేవాళ్లు మంచి సినిమాను భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తే కచ్చితంగా దానికి లాభాలు వస్తాయని నమ్మడం మొదలుపెట్టారు. రాజమౌళి ఆ కాన్ఫిడెన్స్‌ను అందరికీ ఇచ్చారు’’ అని రాజమౌళిని ప్రశంసలతో ముంచేశారు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఎప్పుడు ఎవరిని పొగుడుతారో, ఎప్పుడు ఎవరిని తిడతారో అసలు అర్థమే కాదు. తాజాగా రాజమౌళిని ప్రశంసిస్తూ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ఫ్యాన్స్ అంతా ఆర్జీవీ చెప్పిన ప్రతీ స్టేట్‌మెంట్ కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు.