RT 76 Update..మాస్ మహారాజా రవితేజ (Raviteja ) ఆర్ టి 76 అనే మూవీతో వచ్చే యేడాది సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి కూడా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం భాను భోగవరపు(Bhanu Bhogavarapu)దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత ఆయన చేసే సినిమా దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో రవితేజ సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ మధ్యనే కథ చెప్పిన కిషోర్ తిరుమల.. రవితేజ చెప్పినట్లుగానే ఫైనల్ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసే పనిలో పడ్డారట. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతానికి ది ప్యారడైజ్ (The Paradise) సినిమాను నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి, ఈ సినిమా తర్వాత రవితేజతో RT 76 సినిమా మొదలుపెట్టబోతున్నారు అని తెలుస్తోంది.
అనార్కలి అనే టైటిల్ తో సంక్రాంతి బరిలోకి దిగుతున్న రవితేజ..
అటు ఈ సినిమా మే నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా బరిలోకి దింపాలని చూస్తున్నారట. ఇక ఈ ఏడాదిలోపు ప్రస్తుతం రవితేజ చేస్తున్న భాను భోగవరపు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసే సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి. ఇకపోతే ఈ రెండు సినిమాల తర్వాత ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) తో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. కిషోర్ తిరుమల తర్వాత ఈ సినిమా సెట్ పైకి రానుంది. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘మ్యాడ్ స్క్వేర్’ మే 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాతే కళ్యాణ్ శంకర్ మాస్ మహారాజా కోసం కథను సిద్ధం చేసే పనిలో పడనున్నట్లు సమాచారం.. మొత్తానికైతే వరుస లైనప్పులతో బిజీగా మారుతున్నారు రవితేజ.
రవితేజ కెరియర్..
తెలుగు సినిమా నటుడుగా అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు. 1968 జనవరి 26న ఆంధ్రప్రదేశ్ జగ్గంపేటలో జన్మించిన ఈయన.. సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, విజయవాడ నుండీ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక 2000 సంవత్సరంలో కళ్యాణి(Kalyani )ని వివాహం చేసుకున్న రవితేజకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదాం అనుకొని వచ్చిన రవితేజ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే.. ఆ తరువాత కొన్ని చిత్రాలలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించారు. అలా 1991లో వచ్చిన ‘కర్తవ్యం’, ‘చైతన్య’ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన ఈయన.. కొన్ని సినిమాల తర్వాత 1998లో వచ్చిన ‘సింధూరం’ సినిమాలో సెకండ్ హీరోగా నటించారు. ఇక 1999లో వచ్చిన నీకోసం సినిమా తర్వాత ఆయన మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. కానీ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం తాపత్రయపడుతున్నారని చెప్పవచ్చు.