Military Aid Pause: గత కొన్నేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు మరో షాక్ తగిలింది. ఇకపై ఉక్రెయిన్‌కు అందించే సైనిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ట్రంప్ జరిపిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున మిలటరీ సహాకారం అందించారు.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి కోసం స్పష్టమైన ఉద్దేశాన్ని కల్గి ఉండే వరకు అన్ని రకాల సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందని అమెరికా రక్షణ శాఖ అధికారి తెలిపారు. దీని అర్థం ఉక్రెయిన్‌కు పంపాల్సిన ఏవైనా అమెరికా సైనిక పరికరాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఇప్పటికే ఓడలు లేదా విమానాలలో లోడ్ చేసిన లేదా పోలాండ్‌లోని రవాణా ప్రాంతాలలో ఉన్న ఆయుధాలు కూడా ఉంటాయన్నారు. అంతేకాదు రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగిన సమావేశంలో వివాదం తలెత్తింది. ఉక్రెయిన్‌లో ఖనిజ తవ్వకాలపై అమెరికా చేసిన ప్రతిపాదనకు ఒప్పందంపై సంతకం చేయడానికి వచ్చిన జెలెన్స్కీ చేయకుండానే వెనుదిరిగారు. భవిష్యత్తులో రష్యా తమపై దాడికి పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ఒత్తిడి చేశారు. ఆ క్రమంలో ఇరువురు నేతల మధ్య చర్చ పెరిగి ఒప్పందం రద్దు చేసుకునే స్థాయికి చేరింది. ఆ క్రమంలో డోనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also: Donald Trump: ఈ దేశాలపై నేటి నుంచి సుంకాల మోత.. ఆలస్యానికి నో ఛాన్స్
ఈ సమావేశం తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ జెలెన్స్కీని ‘కృతజ్ఞత లేనివాడని అభివర్ణించగా, మరోవైపు ట్రంప్ ఆయన ‘మూడో ప్రపంచ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాడని’ ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నానని ట్రంప్ ఇప్పటికే అన్నారు. కానీ ఆయన చేసిన కొన్ని ప్రకటనల కారణంగా క్రెమ్లిన్ (రష్యా) అభిప్రాయాలను పట్టించుకోవడం లేదన్నారు .
జనవరిలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో 90 రోజుల పాటు విదేశీ సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇజ్రాయెల్, ఈజిప్టులకు సహాయం కొనసాగింది. అదే సమయంలో ఉక్రెయిన్‌కు కూడా సైనిక సహాయాన్ని కొనసాగించారు.
ట్రంప్ ఈ నిర్ణయం తర్వాత, యూరోపియన్ నేతలు ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వారు అమెరికాకు సమర్పించే కొత్త శాంతి ప్రణాళికపై పని చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై ట్రంప్ ఎలాంటి వైఖరి తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా సహాయం లభిస్తుందో లేదో చూడాలి మరి. అంతేకాదు అమెరికాతో ఖనిజ ఒప్పందానికి తాము సిద్ధమేనని, మరోసారి చర్చలకు వెళ్తామని జెలెన్స్కీ ఇటీవల చెప్పడం విశేషం.