Teja Sajja: హను- మాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కుర్రహీరో తేజ సజ్జా. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయంతో పాటు భారీ కలక్షన్స్ కూడా రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత తేజ సజ్జా తన తదుపరి సినిమాలను ఏరికోరి ఎంచుకుంటున్నాడు.
ప్రస్తుతం తేజ.. ఈగల్ తో హిట్ అందుకున్న కార్తీక్ ఘట్టమనేనితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ కూడా ఒక హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో తేజ సరసన రితిక నాయక్ ను ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో రితిక తెలుగు తెరకు పరిచయమైంది. అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకును ప్రేమించి.. చివరికి తానే పెళ్లి చేసుకొనే అల్లరి అమ్మాయిగా రితిక తెలుగు అభిమానులను కట్టిపడేసింది. ఇక ఆ తరువాత నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో నాని కూతురుగా మెరిసి మరింత పేరు తెచ్చుకుంది. అయితే నాని సినిమాలో ఆమె చేసింది గెస్ట్ రోల్ అయినా కూడా మంచి గుర్తింపే వచ్చింది. ఇక తాజాగా ఈ బ్యూటీకి పాన్ ఇండియా సినిమా ఆఫర్ రావడంతో ఆమె ఎగిరి గంతేసిందని తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు. మరి ఈ సినిమాతో రితిక టాలీవుడ్ స్టార్ గా మారుతుందేమో చూడాలి.