Saif Alikhan:ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif alikhan) పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు శనివారం థానే లో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం డీసీపీ దీక్షిత్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుడి గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. దీంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 16వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో సైఫ్ అలీఖాన్ నిద్రిస్తున్న సమయంలో అనుకోని చప్పుడు కావడంతో హుటాహుటిన బయటకు వచ్చాడు. ఆ ఆగంతకుడిని శాంతింప చేసే ప్రయత్నం చేసిన అతడు శాంతించలేదు. పైగా కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దీంతో సైఫ్ అలీ ఖాన్ నిరాకరించడంతో ఏకంగా పలుమార్లు ఆయనపై కత్తితో దాడి చేశారు. దీంతో హుటాహుటిన సమీపంలో ఉన్న లీలావతి హాస్పిటల్ కి ఆటోలో తరలించారు. ఇక ఆయనను పరీక్షించిన వైద్యులు ఆరుసార్లు కత్తితో పొడిచాడని, అందులో రెండుసార్లు లోతుగా దిగాయని తెలిపారు. అంతేకాదు వెన్నెముకకు కత్తి గుచ్చుకోవడంతో సర్జరీ చేసి తీసేసారు. ప్రస్తుతం ఆయనను స్పెషల్ రూమ్ కి తరలించిన విషయం తెలిసిందే.
నిందితుడు బాంగ్లాదేశీయుడిగా గుర్తింపు..
ఇకపోతే బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించిన పోలీసులు థానేలో ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో డీసీపీ దీక్షిత్ మాట్లాడుతూ.. ” జనవరి 16వ తేదీన తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాము. 30 ఏళ్ల మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా మేము గుర్తించాము. అరెస్టు కూడా చేసాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ ఇంట్లోకి వెళ్ళాడు.అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి, కస్టడీ కూడా కోరుతాము. దీనికి సంబంధించి తదుపరి విచారణ చేపడుతాము. ప్రాథమిక విచారణలో అతడిని బాంగ్లాదేశీయుడిగా గుర్తించాము. నిందితుడు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాసుగా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితమే ముంబై వచ్చాడు. భారతీయుడు అని చెప్పడానికి అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు అని తెలిపారు. మొత్తానికైతే ఈ నిందితుడి గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మూడు బృందాలుగా విడిపోయిన పోలీసులు..
ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందని తెలిసిందో వెంటనే కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారట. అలా దాదాపు 3 రోజుల తర్వాత అతడిని థానేలో అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం కథ సుఖాంతం అయిపోయింది. కేవలం దొంగతనం కోసమే అతడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు అని పోలీసులు నిర్ధారించారు. మరి పూర్తి విచారణలో ఇంకా ఏదైనా ఆధారాలు బయటకు వస్తాయేమో చూడాలి. ఇక మరొకవైపు కరీనాకపూర్(Kareena kapoor) కూడా తన భర్తకు ఇలా జరగడంతో సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేయకండి అంటూ కూడా కోరింది.