Sonu Sood:రీల్ హీరో గానే కాకుండా రియల్ హీరో గా కూడా అనిపించుకున్నారు సోనూసూద్ (Sonu Sood). ‘అరుంధతి’ సినిమాతో ఒక్క నైట్ లోనే స్టార్ విలన్ అయిపోయారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. కరోనా సమయం నుంచి ఎంతోమందికి సమాజ సేవ చేస్తూ, ఆర్థికంగా కూడా అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రియల్ హీరో అనిపించుకున్న ఈయన తాజాగా “సంకల్ప్ దివాస్” అవార్డును దక్కించుకోవడం జరిగింది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్, లలిత కళాతోరణం లో సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మానవతావాది , వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, తన పుట్టినరోజును పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 28న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సంకల్ప్ కిరణ్ పురస్కారం..
సమాజ సేవ చేయడంలో మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులను కూడా గుర్తించి వారిని సత్కరించడంలో లయన్ డాక్టర్ వై.కిరణ్ ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలోనే సంకల్ప్ దివాస్ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని “సంకల్ప్ కిరణ్ పురస్కారం” తో సత్కరిస్తారు. రెండు దశాబ్దాలుగా ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరించారు.ఇక వారిలో కిరణ్ బేడీ, సుందర్ లాల్ బహుగుణ, సందీప్ పాండే, అన్న హజారే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎంతోమంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సోనూ సూద్ కూడా చేరిపోయారు. తాజాగా నిన్న సాయంత్రం ఆయనను సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరించడం జరిగింది.
సంకల్ప్ దివాస్ అధినేత కిరణ్ మాట్లాడుతూ..
ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ వై. కిరణ్ మాట్లాడుతూ.. “ముఖ్యఅతిథిగా హాజరైన ‘హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్’ ఈ కార్యక్రమానికి రావడం మాకు సంతోషంగా ఉంది. నా స్నేహితుడు,మన కుటుంబ సభ్యుడిగా భావించే వ్యక్తి, సినిమాల్లో విలన్ గా నటిస్తూ, రియల్ లైఫ్ లో హీరోగా అనిపించుకుంటున్న సోనూసూద్ ను ఈ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఈరోజు 50 ప్రత్యేక పాఠశాలల నుండి నా ప్రియమైన విద్యార్థులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారే ఈ కార్యక్రమానికి స్టార్స్, నా హృదయానికి బాగా దగ్గరైన సూరారం, నర్మిట్ట గ్రామాల నుండి అనేకమంది ఈ వేడుకకు హాజరయ్యారు. గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఏడాది సంకల్ప్ దివాస్ ను నిర్వహిస్తున్నాము.. నా పుట్టినరోజు వేడుకను అర్ధవంతంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా కొందరి జీవితాల్లో నైనా వెలుగు నింపేలా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నాడు 2000రూపాయలతో నేను నా జీవితాన్ని ప్రారంభించాను. దేవుడు ఆశీస్సులు, నా తల్లిదండ్రులు నేర్పిన కృషి, పట్టుదలతోనే ఈరోజు ఇంతటి వాడినయ్యాను. ఇక ఇప్పుడు ఇందులో రెండు గ్రామాలు, 50 పాఠశాలలు కూడా భాగమయ్యాయి” అంటూ కిరణ్ తెలిపారు.
సోనూసూద్ మాట్లాడుతూ..
సోనూసూద్ మాట్లాడుతూ.. “ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. సోదరుడు కిరణ్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసే గొప్ప సేవా కార్యక్రమాల గురించి నేను వింటూనే ఉంటాను. అయితే ఆయనను కలవక ముందే ఆయన గొప్పతనం గురించి విన్నాను. ఈ ప్రత్యేక పిల్లలు రియల్ హీరోలు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.. ఈ తరంతో పాటు భవిష్యత్తు తరాలు కూడా సమాజ సేవ వైపు అడుగులు వేసేలా కిరణ్ స్ఫూర్తి నింపుతున్నారు” అంటూ తెలిపారు సోనూ సూద్.