Cyclone Fengal : ఏపీకి రానున్నరెండు, మూడు రోజుల్లో భారీ వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ దగ్గర తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన అధికారులు.. రాష్ట్రంలోని రెండు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారుతుందని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు.. ఈ తుపానుకు పెంగల్ గా నామకరణం చేశారు. ఈ వాయుగుండం గడిచిన 6 గంటల నుంచి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణశాఖ అధికారి వెల్లడించారు. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర ఈశాన్య దిశగా 270, నాగపట్టణానికి తూర్పుగా 300 కేంద్రీకృతమైందని వెల్లడించారు.
ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదిలి.. రానున్న 6 గంటల్లో తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నవంబర్ 30న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర, కారైకాల్ – మహాబలిపురం తీరాల మధ్య.. తీరం దాటే అవకాశముందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు.
తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుపుతున్నారు. ఇక పోర్టుల్లోను తుఫాను ప్రభావంతో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారులు.. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను సమయంలో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు.
బంగాళాఖాతంలో పెను తుపాను తీవ్రరూపం దాల్చడంతో పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలు, కళాశాలలకు స్థానిక యంత్రాంగం శుక్ర, శనివారాలు సెలవులు ప్రకటించారు. తుపాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులు, వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు, ఈ వారం చివరిలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని.. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : గిరినాగుకు రక్తపింజరకు సమరం.. వదల బొమ్మాళీ రేంజ్ లో వేట.. క్షణక్షణం ఉత్కంఠ
పెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నవంబర్ 29, 30 తేదీలలో.. ఉత్తర తమిళనాడులోని ప్రాంతాలతో పాటు విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు, డెల్టా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ జిల్లాలలో పాటు యానాం, రాయలసీమలలో భారీవర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాలలో స్థానికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.