Singanamala Ramesh: నిర్మాతలు లేకపోతే సినిమా తెరకెక్కించడానికి డబ్బులే ఉండవు. అందుకే దర్శకుడికి పుట్టిన ఆలోచనకు ప్రాణం పోయాలంటే నిర్మాతల అవసరం చాలా ఉంటుంది. అలాగే నిర్మాతలకు డబ్బులు ఇచ్చి ఆదుకునే వారు కూడా ఉంటారు. వారే ఫైనాన్షియర్స్. ఒకప్పుడు ‘కొమురం పులి’, ‘ఖలేజా’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు శింగనమల రమేష్ బాబు. కొన్నిరోజుల క్రితం రమేష్ బాబు స్టేజ్‌పైకి వచ్చి ఈ సినిమాల గురించి, యాక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానిపై వెంటనే బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యాడు. తాజాగా తనకు ఫైనాన్షియర్స్‌గా సాయం చేసిన వైజయంతి రెడ్డి, సదానంద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ దీనిపై వివరణ ఇచ్చారు.
ఇవే నిజానిజాలు
‘కొమురం పులి’, ‘ఖలేజా’ సినిమాలకు డబ్బులు రాలేదని, నటీనటుల వల్ల ఇబ్బందులు పడ్డానని వ్యాఖ్యలు చేశాడు శింగనమల రమేష్ బాబు. ఆ వ్యాఖ్యలను ఫైనాన్షియర్స్ కొట్టిపడేశారు. తను చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అని క్లారిటీ ఇచ్చారు. తమ పెట్టుబడితోనే రమేష్ బాబు ‘కొమురం పులి’, ‘ఖలేజా’ సినిమాలు తీశాడని, ఆపై డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని బయటపెట్టారు. కానీ రమేష్ బాబు మాత్రం దీనికి అంతా రివర్స్‌లో చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో నటీనటులు, ఫైనాన్షియర్స్.. ఇలా అందరిపై నిందలు వేశారు కాబట్టే ఆయనకు డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్స్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోరాటం చేస్తాం
శింగనమల రమేష్ బాబు ఖాతాలో తమతో పాటు మరెందరో బాధితులు ఉన్నారని తెలిపారు వైజయంతి రెడ్డి. అందుకే తనను ఫిలిమ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరూ కలిసి రమేష్‌ను చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ సివిల్ కోర్టులో తనపై కేసు నడుస్తోందని గుర్తుచేశారు. త్వరలోనే రమేష్ బాబుపై క్రిమినల్ కేసు కోసం అప్పీల్ చేయాలని సీఐడీ సిద్ధమయ్యింది. వారితో పాటు తాము కూడా హైకోర్టుకు వెళ్తామని అన్నారు. న్యాయం జరిగే వరకు ఈ విషయంపై పోరాటం చేస్తూనే ఉంటామని గట్టిగా చెప్పారు ఫైనాన్షియర్స్. మొత్తానికి ఒకప్పుడు నిర్మాతగా సినిమాలు తెరకెక్కించిన రమేష్ బాబు.. ప్రస్తుతం తన వ్యాఖ్యల వల్ల చిక్కుల్లో పడక తప్పడం లేదు.
Also Read: ‘తండేల్’లో ఆ అంశాన్ని వాడుకోలేకపోయిన దర్శకుడు.. అంచనాలు తారుమారు..
అంతా ఒక్కటయ్యారు
శింగనమల రమేష్ బాబు (Singanamala Ramesh) చేసిన మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తులను బయటపెట్టాలని ఫైనాన్షియర్స్ అంతా నిర్ణయించుకున్నారు. వాటి వల్ల బాధితులు అయిన వారంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కూడా కలుస్తామని ఫైనాన్షియర్స్ తెలిపారు. ఈ పోరాటం చేయడానికి ఫైనాన్షియర్స్ అంతా ఒక్కటయ్యారు. మామూలుగా నిర్మాతలకు, ఫైనాన్షియర్స్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అందుకే వారి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా పెద్దగా బయటికి రావు. కానీ శింగనమల రమేష్ బాబు మాత్రం ఒకప్పుడు తనకు సాయం చేసిన ఫైనాన్షియర్స్ గురించే తప్పుగా మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.