Soundarya Death Anniversary: అభినయ సావిత్రి సౌందర్య (Soundarya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇవి మరణించి 21 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇంకా ఆమె రూపం మన కళ్ళముందే కదలాడుతోంది అంటే.. ఆమె తన నటనతో, చక్కటి మోముతో, చిరునవ్వుతో ఆడియన్స్ ను ఎంతలా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. సౌందర్య నేడు మనమధ్య లేకపోవచ్చు కానీ ఆమె నటించిన ఎన్నో చిత్రాలు మనకు ఆమెను గుర్తు చేస్తూనే ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో కూడా.. స్టార్ హీరోలకు లేట్ తల్లిగా మనకు ఫోటోల రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. అంతలా ఎంతోమందికి ఆరాధ్య దేవతగా మారిన సౌందర్య తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కలుపుకొని సుమారుగా 100కు పైగా చిత్రాలలో నటించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే ఈరోజు సౌందర్య వర్ధంతి. ఈ సందర్భంగా ఆమె గురించిన కొన్ని విషయాలను అభిమానులు నెమరు వేసుకుంటున్నారు.
అభినయ సావిత్రి సౌందర్య..
సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగప్రవేశం కోసం తన పేరును సౌందర్యగా మార్చుకుంది. ప్రాథమిక విద్యను అభ్యసిస్తునప్పుడే మొదటి సినిమాలో నటించిన ఈమె, ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా తన తండ్రి స్నేహితుడు, గంధర్వ (1992) సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించారు. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మోరు’ సినిమా విజయవంతమైన తర్వాత చదువును మధ్యలోనే ఆపేసిన ఈమె.. ఆ తర్వాత ‘రైతు భారతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరో కృష్ణ (Krishna ) మరదలుగా భానుచందర్ (Bhanu chandra)సరసన నటించింది. ఈ సినిమా తర్వాత ‘మనవరాలి పెళ్లి’ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ‘రైతు భారతం’ సినిమా నిర్మాణంలో కాస్త అవకతవకలు ఏర్పడడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలై అలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ సినిమా ద్వారా పరిచయమైంది.
నటిగానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్..
ఇక ఈమె తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం తో పాటు హిందీలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో కలిసి ‘ సూర్యవంశ్’ అనే హిందీ సినిమాలో కూడా నటించింది. ఇక అంతే కాదు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ‘ద్వీప’ అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది.ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గానూ.. స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. అలాగే పలు అంతర్జాతీయ చిత్రాలలో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది.
అన్నీ తెలిసినా సౌందర్య మరణాన్ని ఆపలేకపోయిన తండ్రి.
ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భాజాపాకి ప్రచారం చేయడానికి వెళ్ళిన ఈమె.. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరఫున ప్రచారం చేయడానికి చార్టెడ్ విమానంలో ఆమె బయలుదేరారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా ఉన్నారు. అయితే అక్కడ దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సౌందర్య మరణాన్ని ముందే గ్రహించిన ఆమె తండ్రి సత్యనారాయణ ఆమె మరణాన్ని మాత్రం ఆపలేకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఆయన ఒక జ్యోతిష్యులు.తన కూతురు ఇండస్ట్రీలోకి వస్తుందని, అగ్ర హీరోలతో నటిస్తుందని, ఎనిమిదేళ్లు బిజీగా ఉండి, 2004లో చనిపోతుందని ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చెప్పారు. ఇన్ని తెలిసి కూడా ఆయన ఆమె మరణాన్ని ఆపలేకపోయారని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సౌందర్య మరణం ఇండస్ట్రీకి తీరని లోటును మిగులుస్తోందని చెప్పవచ్చు.
Siva Sankar Master: కట్టుకున్న భార్య మోసం చేసింది.. 70 ఎకరాల ఆస్తిపై అంటూ మాస్టర్ కొడుకు ఆవేదన..