Trump Residences project: ఈ మధ్యకాలం బాగా ఫేమస్ అయిన నేత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతు బట్టదు. స్వతహాగా రియల్టర్ అయిన ట్రంప్, తన బిజినెస్‌ను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. అమెరికాలో రియల్టర్ వ్యాపారం చేసిన ఆయన, ఆ దేశం బయట కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టారు. తన వ్యాపారానికి భారతదేశాన్ని ఎంచుకున్నారు.
ట్రంప్ బ్రాండ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టు
భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రెసిడెన్షీ ప్రాజెక్టులు చేపడుతోంది ట్రంప్ బ్రాండ్. అందులో గురుగ్రామ్‌లో చేపట్టనున్న అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టు అందరిని ఆకట్టుకుంటోంది. ట్రంప్ బ్రాండ్ కింద గురుగ్రామ్‌లో చేపడుతున్న రెండో ప్రాజెక్టు. దేశవ్యాప్తంగా ఇది ఆరో ప్రాజెక్టు కానుంది.
ట్రంప్ రెసిడెన్సీ ఐదేళ్లలో పూర్తి కానుందన్నది డెవలపర్ల మాట. ట్రంప్ బ్రాండ్ పేరుతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు రియల్ ఎస్టేట్ కంపెనీలు స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్-ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా ఒక ప్రకటన చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.2200 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నారు.
ఫ్లాట్ ధర రూ.8 కోట్ల పైమాటే
ట్రంప్ రెసిడెన్సీ ప్రాజెక్టు గురించి కీలక విషయాలు బయటపెట్టారు డెవలపర్లు. ఈ ప్రాజెక్టులో 290 ఫ్లాట్లు ఉండనున్నాయి. మొత్తం విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. చదరపు అడుగు రూ. 27,000 ధరతో మొదలుకానుంది. అందులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య ఉంటుందని చెప్పుకొచ్చారు.
ALSO READ: తులం బంగారం రూ.98 వేలు పైమాటే.. కొంటారా? డ్రాపవుతారా?
ఈ ప్రాజెక్టు పూర్తయితే విక్రయించడం ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం రావచ్చని భావిస్తోంది స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్ సంస్థ. గురుగ్రామ్‌లో రెండో ట్రంప్-బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. అమెరికా బయట ఒకటి కంటే ఎక్కువ ట్రంప్ టవర్‌లను కలిగి ఉన్న ఏకైక నగరం గురుగ్రామ్ అని ట్రిబెకా సంస్థ తెలిపింది.
52 అంతస్థుల నిర్మాణం
M3M గ్రూప్ సంస్థలైన స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్-ట్రిబెకాలు ట్రంప్ రెసిడెన్సీ ప్రాజెక్టును చేపడుతున్నాయి. దాదాపు 200 మీటర్ల ఎత్తులో 52 అంతస్తులతో రెండు టవర్లు నిర్మిస్తున్నారు. అందులో మూడు, నాలుగు అపార్టుమెంట్లు ఉండనున్నాయి. వీటిని 3,000 చదరపు అడుగుల నుండి 5,000 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు.
స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతోంది. దేశంలో ట్రంప్ బ్రాండ్ అధికారిక ప్రతినిధులు ట్రిబెకా డెవలపర్స్.. డిజైన్, మార్కెటింగ్, అమ్మకాలకు నాయకత్వం వహిస్తారు. ఈ ప్రాజెక్టుపై ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ స్పందించారు. రెండో ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు.
అద్భుతమైన భాగస్వాములతో చేయడం మరింత గర్వంగా ఉందన్నారు. ట్రంప్ రెసిడెన్సీ.. గ్లోబల్ పోర్ట్ ఫోలియోలో అత్యంత ప్రసిద్ధమైనదిగా నిలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలోని ఇతర ట్రంప్ ప్రాజెక్టుల గురించి నోరు విప్పారు. దేశంలో ఇప్పటివరకు ప్రకటించిన ఆరు ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్టుల్లో నాలుగు ఉన్నాయి. పూణే, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్‌ల్లో పూర్తి అయ్యాయని అన్నారు. పూణేలో గత నెలలో ఒకటి ప్రకటించారు.