Sonu Sood: పాన్ ఇండియా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనుసూద్(Sonu Sood) సినిమాలలోనే కాదు నిజ జీవితంలో హీరోగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి అండగా నిలిచిన ఈయన ఆర్థిక భరోసా ఇచ్చారు. అంతేకాదు తన పేరు పైన అలాగే తన భార్య పేరు పైన ఉన్న ఆస్తులను సైతం అమ్మి ప్రజలకు అండగా నిలిచారు అంటే, ఈయన మంచి మనసు ఏంటో అర్థం చేసుకోవచ్చు. కష్టపడితే ప్రతిఫలం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా లభిస్తుంది అని, ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు నిరూపించారు కూడా.. కానీ తన మంచితనానికి కూడా ఇప్పుడు గౌరవం లభించింది.
సోనూసూద్ కి అరుదైన గౌరవం..
సామాజికంగా ఈయన చేస్తున్న సేవలకు గానూ సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన “సంకల్ప్ దివాస్” అనే కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త అయిన డాక్టర్ వై.కిరణ్.. ప్రతి ఏడాది నవంబర్ 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక అదే ఆనవాయితీగా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సమాజ సేవే లక్ష్యంగా సుచిరిండియా ఫౌండేషన్ ను నిర్వహిస్తోంది సుచిరిండియా గ్రూప్. సమాజానికి విశేష సేవ అందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారిని సత్కరిస్తూ ఉంటారు.
సంకల్ప్ దివాస్ అవార్డు అందుకోనున్న సోనూసూద్
ఇక ఈ ఏడాది సంకల్ప్ దివాస్ అవార్డు సోనూసూద్ కి వరించనుంది. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లలిత కళా తోరణం లో సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత్ బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్ఈ నికోలాయ్ యాంకోవ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఆయన చేతుల మీద గానే సోనూసూద్ కి సంకల్ప్ దివాస్ అవార్డు బహుకరించనున్నట్లు సమాచారం.
సంకల్ప్ దివాస్ ముఖ్య ఉద్దేశం..
ఈ సంకల్ప్ దివాస్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, వారికి తగిన జీవితాన్ని ప్రసాదించడమే. ప్రస్తుతం ఆకలితో అలమటించే వారి ఆకలి తీర్చి, నిత్యవసర వస్తువులను కూడా అందిస్తోంది. దీంతో పాటు భవిష్యత్తుకు బాటలు వేసే వస్తువులను అందించడం కూడా సంకల్ప్ దివాస్ చేస్తూ ఉండడం గమనార్హం. అనాధ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులను కూడా గుర్తించి, వారి చదువుకు కావలసిన అన్ని సహాయ సహకారాలను ఈ సంస్థ అందిస్తోంది.. అలాగే దివ్యాంగులకు కూడా అవసరమైన పరికరాలను అందించి, వైకల్యాన్ని అధిగమించి, వారు తమ జీవితంలో ముందుకు సాగేలా చేయడంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఒంటరి, పేద మహిళలకు కుట్టు మిషన్లు లేదా ఇతర వృత్తులలో పనిచేసేలా ప్రోత్సహిస్తోంది. కేవలం సహాయం చేసి ఊరుకోకుండా, వారికి అడుగడుగునా కూడా అండగా నిలుస్తూ.. వారి జీవితానికి పునాది బాటలు వేస్తోంది సంకల్ప్ దివాస్. ఇక కరోనా సమయం నుంచి ఇప్పటివరకు అడిగిన వారికి లేదనకుండా అవసరం ఉన్న వారి అవసరాలు తీరుస్తూ మంచి పేరు సొంతం చేసుకున్నారు సోనూ సూద్. ఈయన మంచితనాన్ని గుర్తించి ఈ అవార్డును అందజేయనున్నారు.