Cinema: సినిమాహాల్స్ లో అందరికీ ఎదురయ్యే ప్రాబ్లమే. అక్కడ కొందామంటే రేటు ఎక్కువ. పోనీ, ఇంటి నుంచో బయటి నుంచో తెచ్చుకుందామంటే లోనికి అనుమతించరు. మరెలా? ఈ కామన్ ప్రాబ్లమ్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సినిమా చూసేందుకు వచ్చే వారిలో ఓ వ్యక్తి బయటి నుంచి జిలేబి తెచ్చి.. తిని.. ఆ పాకం చేతులను కూర్చునే సీటుకు తుడిస్తే ఎలా? అంటూ కాస్త కామెడీని జోడించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లు ప్రైవేటు ఆస్తి కాబట్టి.. షరతులు, నిబంధనలు విధించే అధికారం వారికి ఉంటుందని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధం విధించే హక్కు మల్టీప్లెక్స్, థియేటర్ యాజమాన్యాలకు ఉందని తెలిపింది. ఎక్కడ సినిమా చూడాలి? అక్కడ అమ్మే వాటిని కొనాలా? వద్దా? అని ఎంచుకునే హక్కు ప్రేక్షకుడికి ఉన్నట్లుగానే.. థియేటర్ యజమానులకు బయటి ఆహారంపై షరతులు విధించే హక్కు ఉంటుందని వెల్లడించింది.
అయితే, కొన్ని కండిషన్లు కూడా విధించింది కోర్టు. చిన్నారులు, పిల్లల కోసం ఆహారాన్ని అనుమతించాలని.. ప్రేక్షకులందరికీ ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించింది. థియేటర్ లోపల ఉన్న వాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రేక్షకులను బలవంతం చేయకూడదని తెలిపింది.
థియేటర్లలోకి బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ జమ్మూకశ్మీర్ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.