Allu Arjun Case :తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. అల్లు అర్జున్ పై పూర్తి వ్యతిరేకత ఏర్పడుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సొంత ఇండస్ట్రీ నుంచి మరో భారీ షాక్ తగలడంతో ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ ఒక సర్కులర్ జారీ చేసింది.
బన్నీకి వ్యతిరేకంగా ఫిలిం ఛాంబర్..
అందులో “.2024 డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన వర్ణనాతీతం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఈ సంఘటన ఎవరు ఊహించనిది. అయితే ఈ సంఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మనం అండగా నిలుద్దాం. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్యామిలీకి, తల్లిని కోల్పోయిన ఆ అబ్బాయికి ఆర్థికంగా అండగా ఫిలిం ఛాంబర్ సభ్యులంతా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక ఎవరైతే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ లో సభ్యులుగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా స్టాండ్ తీసుకొని మీ వంతుగా ఆ బాలుడి కుటుంబానికి డబ్బులు డొనేట్ చేయాలని కోరుతున్నాము” అంటూ ఫిలిం ఛాంబర్ అకౌంట్ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్న సునీల్ నారంగ్ (Sunil Narang)ఈ మేరకు సర్కులర్ విడుదల చేయడంతో పలువురు నెటిజెన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలుడి కుటుంబానికి అండగా నిలవడం కోసం ముందుకు వచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మండిపడుతున్న నెటిజన్స్..
ఇదిలా ఉండగా ఒక అభిమాని మరణించింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. కానీ ఈ విషయంపై ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించలేదు. కానీ ఈ సంఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి.. బెయిల్ మీద బయటకి రావడంతో ఆయన ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. అతడిని పరామర్శించడానికి బారులు తీరారు. అసలు సెలబ్రిటీలు ఎందుకు ఈ విషయంపై స్పందించలేదు? అసలు మీలో మానవత్వం ఉందా? లేక చచ్చిపోయిందా? డబ్బున్నోడిదే రాజ్యమా? అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ఒక్కరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ జైలుకెళ్ళి వచ్చిన ఆయన ఇంటికి బారులు తీరారు. ఆయన కన్ను పోయిందా? కాలు పోయిందా? నష్టపోయిన వారిని పరామర్శించకుండా ఇలాంటి వారిని పరామర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. ఇకపోతే ముఖ్యమంత్రి అలా కామెంట్లు చేశారో లేదో వెంటనే జగపతిబాబు(Jagapathibabu) హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా అభిమానంతో అభిమాన నటుడి సినిమా చూడడానికి వెళ్ళిన శ్రీ తేజ.. తన తల్లిని కోల్పోయాడు. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా సెలబ్రిటీలు అందరూ స్పందించి, ఆ బాలుడికి అండగా నిలవాలని నెటిజన్స్ కోరుతున్నారు.