
Samantha: సమంత అంటే చాలామందికి ఇష్టం. అంతకుమించి అభిమానం. ఆమె నటనకు ఫిదా అయ్యే వాళ్లు అధికం. సమంత అందానికి ఆకర్షితులయ్యేవారు ఎక్కువే. శకుంతలకు ఫుల్ ఫాలోయింగ్. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత.. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తమ అభిమాన నటికి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో కామెంట్లతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు అనేకమంది. కానీ.. అతను అందరిలాంటి అభిమాని కాదు. అంతకుమించి. అతనేం చేశాడంటే…
ఏకంగా సమంతకు గుడి కట్టేశాడు. గుండెల్లో కాదు తన ఇంట్లోనే. ఆమెను దేవతలా కొలుస్తున్నాడు. ఆమె నటనను, సామాజిక సేవను ఆరాధిస్తున్నాడు. అందుకే, తన అభిమానమంతా పోగేసి.. దాచుకున్నది ఖర్చు చేసి.. సమంత కోసం గుడి కడుతున్నాడు.
అతని పేరు సందీప్. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడు గ్రామం. సమంతకు పిచ్చ ఫ్యాన్. ఆ అభిమానంతోనే తన ఇంటి ఆవరణలో ఆమెకో గుడి కట్టిస్తున్నాడు. ఇప్పటికే సమంత నవ్వుతున్న రూపంతో విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహానికి, గుడికి తుదిమెరుగులు దిద్దే పని జరుగుతోంది. ఏప్రిల్ 28న సమంత టెంపుల్ ఓపెనింగ్.
ఎందుకు సమంతకు గుడి కడుతున్నావ్ అని అడిగితే ఆసక్తికర ఆన్సర్ చెబుతున్నాడు సందీప్. సమంత నటనతో పాటు ఆమె చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు తాను వీరాభిమానిగా మారానని అంటున్నాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సమంతను తెగ పొగిడేస్తున్నాడు. అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతే తన దేవత అంటున్నాడు.
అయితే.. సందీప్ ఇప్పటి వరకు సమంతను నేరుగా చూడలేదు.. కలవలేదు. తాను కడుతున్న గుడి నిర్మాణం విషయం తెలిసాకనైనా సమంతను కలిసే అదృష్టం వస్తుందని ఆశిస్తున్నాడు. సమంతకు సందీప్ గుడి కడుతుండటంపై గ్రామస్థులు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. సమంత ఫ్యాన్స్ మాత్రం మనోడికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.