Vijay Deverakonda..కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా రౌడీ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరిగా ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమా కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నా విజయ్ దేవరకొండ తాజాగా ‘కింగ్ డమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. వేదికపై హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఈయన.. టాలీవుడ్ ఈ రేంజ్ లో దూసుకు వెళ్లడం వెనుక బలమైన కారణాన్ని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.
రాజమౌళి వల్లే తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి పెరిగింది..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈరోజు సౌత్ సినీ పరిశ్రమ పాన్ ఇండియా స్థాయిలో హవా సాగించడానికి కారణం రాజమౌళి (Rajamouli ).. ‘బాహుబలి’తో చేసిన అసాధారణ ప్రయత్నమే. ఆయన తెలుగు సినీ పరిశ్రమ కోసం ఎంతో ఫైట్ చేశారు.. ఈ ఎదుగుదలకు ముఖ్య కారణం అయ్యారు. భారీ పెట్టుబడితో ఇద్దరు స్టార్లను ఐదు సంవత్సరాల పాటు లాక్ చేసి బాహుబలి చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఒకవేళ ఈ సినిమా గనుక వర్కౌట్ కాకపోయి ఉండి ఉంటే.. ఐదేళ్లపాటు ఏ ఇతర సినిమా చేయని ఈ స్టార్ల కెరియర్ ఎలా ఉండేదో.. ఒకవేళ ఈ సినిమా వర్కౌట్ కాకపోయి ఉంటే నిర్మాతల పరిస్థితి ఏమైయ్యేదో.. ఈ సినిమాపై ఆధారపడిన వాటాదారులంతా ఏమి అయ్యేవారో.. తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. అయినా సరే ప్రతి ఒక్కరు రాజమౌళి పై నమ్మకం పెట్టి, తమ సమయాన్ని ఆయన కోసం వెచ్చించారు. ఇక ఆయన తెలుగు సినిమా కోసం ఫైట్ చేసి నేడు టాలీవుడ్ సినీ పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు అందివ్వడం నిజంగా గ్రేట్ అంటూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు విజయ్ దేవరకొండ
మరో రెండేళ్లలో ఇండియన్ సినిమా మాత్రమే ఉంటుంది..
ఇకపోతే ప్రతి ఒక్కరూ ఉన్న స్థలం కోసం ఫైట్ చేయాలని, ఈరోజు తాను కూడా ఈ సినిమాని పాన్ ఇండియాలో విడుదల చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం ఇప్పుడు ప్రపంచం చిన్నదిగా మారిపోవడమేనని.. భాషా సరిహద్దులు చెరిగిపోయి, ఇండియన్ సినిమా గా మారడమే దీనికి ప్రధాన కారణం అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. మరో రెండు సంవత్సరాలలో తెలుగు సినీ పరిశ్రమ మరింత మారిపోతుంది అంటూ విజయ్ దేవరకొండ జోస్యం చెప్పారు. ఇక కేవలం సౌత్ నుంచే కాదు ఉత్తరాది నుంచి కూడా విభిన్నమైన భాషల ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన ఫిలిం మేకర్స్ పుట్టుకొస్తారని, వారంతా కూడా బాలీవుడ్ కి డిఫరెంట్ సినిమాలతో కొత్త వెలుగులు తీసుకొస్తారని, సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మొత్తం రెండేళ్లలో ఇండియన్ సినిమా అని మాత్రమే పిలవబడుతుంది” అంటూ కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.