Toxic Movie: ప్రస్తుతం సౌత్ సినిమా అనేది నేషనల్ రేంజ్‌లోనే కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో కూడా ఎక్కడికో వెళ్లపోతోంది. నార్త్ ఇండస్ట్రీ.. అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేక వెనకబడుతుంటే సౌత్ సినిమాలు మాత్రం అన్ని రకాలుగా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అందుకే వీటిని ఇంటర్నేషనల్ రేంజ్‌లో ప్రమోట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాకు ఆ రేంజ్ వచ్చేసింది. తరువాత కన్నడ సినిమాకే ఆ గౌరవం దక్కాలని హీరో యశ్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన తరువాతి సినిమా ‘టాక్సిక్’ కోసం భారీ ప్లాన్ వేశాడు. అది వర్కవుట్ అయితే కన్నడ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌కు చేరుకోవడం ఖాయమని నమ్ముతున్నాడు.
ఫుల్ ఫోకస్
ముందుగా సీరియల్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు యశ్. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. కానీ తన కటౌట్‌కు తగిన సినిమా పడలేదు. అందుకే తను ఎక్కువగా ప్రేక్షకులకు తెలియలేదు. అప్పుడే దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగాడు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్‌లో యశ్‌ను హీరోగా ఎంపిక చేశాడు. ఆ సినిమాల్లో రాకీ భాయ్‌గా యశ్ చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్ తర్వాత యశ్ మరొక సినిమా చేయలేదు. ప్రస్తుతం ‘టాక్సిక్’పైనే తన ఫుల్ ఫోకస్ పెట్టాడు. తాజాగా ఈ మూవీకి గ్లోబల్ స్థాయిలో రీచ్ రావడం కోసం ఒక అంతర్జాతీయ సంస్థతో చర్చలు మొదలుపెట్టాడు.
Also Read: 13 ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమయిన విశాల్ సినిమా.. మరీ ఇంత లేటా.?
అదే టార్గెట్
‘టాక్సిక్’ (Toxic) సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. దాంతో పాటు యశ్ (Yash) కూడా దీనికి నిర్మాతగా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి 20త్ సెంచరీ ఫాక్స్ సంస్థతో చర్చలు మొదలుపెట్టారు. వారు ఒప్పుకుంటే ‘టాక్సిక్’ను అంతర్జాతీయ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 20త్ సెంచరీ ఫాక్స్ అనేది పాపులర్ అమెరికన్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ కంపెనీ. ‘టాక్సిక్’ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం కోసం యశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని కన్నడ మీడియా బయటపెట్టింది. ఒకవేళ 20త్ సెంచరీ ఫాక్స్ సంస్థ ఒప్పుకోకపోయినా వేరే సంస్థలతో మాట్లాడడానికి తను సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. అలా ఈ మూవీ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుంది.
అప్పుడే విడుదల
గత కొన్నేళ్లుగా ‘టాక్సిక్’ సినిమా ప్రొడక్షన్ జరుపుకుంటోంది. షూటింగ్ కూడా ఎంతవరకు వచ్చిందనే అప్డేట్ బయటికి రావడం లేదు. దీంతో ఒక్క అప్డేట్ ఇస్తే బాగుంటుందని యశ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 2025 డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కానీ ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయనే గ్యారెంటీ లేదు. షూటింగ్ పూర్తయ్యే సమయానికి విడుదల తేదీ గురించి ఆలోచించాలని వారు డిసైడ్ అయ్యారట. మొత్తానికి 2025లో విడుదల కానున్న ఎన్నో పాన్ ఇండియా సినిమాల్లో ‘టాక్సిక్’ కూడా యాడ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచిచూడాల్సిందే.