Tunisia migrants Dead | ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన ఉన్న టునీషియా దేశంలో భారీ సముద్ర ప్రమాదం జరిగింది. సముద్ర మార్గాన టునీషియా నుంచి ఇటలీకి దొంగచాటుగా వెళుతున్న రెండు పడవలు మునిగి పోయాయి. ఈ ఘటన టునీషియా తీరానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న కెర్కెన్నాహ్ ఐల్యాండ్స్ వద్ద జరిగింది. ఈ పడవలలో సాహరకన్ ఆఫ్రికా దేశాలకు చెందిన వారు యురోప్ దేశమైన ఇటలీకి బతుకుతెరువు కోసం వలస వెళుతున్నారు. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయారని స్థానిక టునిషియా టివి తెలిపింది.
మెడిటెర్రనియన్ సముద్రంలో జరిగిన ఈ ప్రమదంలో మొత్తం 83 మందిని కాపాడినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అయితే గత వారం రోజుల్లోనే ఇలాంటి నాలుగు పడవ ప్రమాదాలు జరిగాయి. మునిగిపోయిన నాలుగు పడవల్లో మూడు టునీషియాకు చెందినవి కాగా.. ఒకటి లిబ్యాకు చెందిన పడవ. ఈ నాలుగు పడవ ప్రమాదాల్లో మొత్తం 84 మంది చనిపోయారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
2024 సంవత్సరంలో ఇలా అక్రమంగా ఆఫ్రికా దేశాల నుంచి యురోప్ కు సముద్ర మార్గంలో వలస వెళ్లేందుకు ప్రయత్నించి 2,200 మంది మెడిటెర్రనియన్ సముద్రంలో మునిగి చనిపోయారని యునిసెఫ్ సంస్థ ప్రకటించింది. సముద్ర మార్గాన అక్రమంగా వలస వెళుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు చనిపోతున్నారని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. పైగా వలస వెళుతున్న వారిలో అంతా యువత. వీరిలో టీనేజర్లు కూడా ఉండడం గమనార్హం. ఆఫ్రికా దేశాలలో పేదరికం, అంతర్యుద్ధాలు ఉండడంతో మెరుగైన జీవనం కోసం ఇతర దేశాలకు వలస వెళుతున్నారు.
ప్రపంచమంతా న్యూ ఇయర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అర్ధరాత్రి టునీషియా నుంచి ఇటలీ భూభాగమైన లాంపెడూసాకు బయలుదేరిన ఒక పడవ మునిగి 20 మంది మరణించారు. వీరిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 27 మంది ఉన్న ఈ పడవలో ఏడుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ఈ ఏడుగురిలో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఆమె తల్లి సముద్రంలో మునిగిపోయింది. తల్లి మృతదేహం కూడా లభించలేదు. ఇటలీ భూభాగమైన లాంపెడూసా టునీషియా కు అతిసమీపంలో ఉంది. ఇది యూరోప్ ఖండానికి ఆఫ్రికా నుంచి ముఖ ద్వారంగా ఉంది.
గత పదేళ్ల నుంచి అంటే 2014 నుంచి చూసుకుంటే 31,184 మంది వలసదారులు మెడిటెర్రనియన్ సముద్రంలో మునిగి చనిపోయారు. వీరంతా ఆఫ్రికా నుంచి బయలుదేరి ఇటలీ, మాల్టా దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నించనవారే. ఒక్క 2023 మూడు లోనే 3155 మంది చనిపోయారు.
వలసదారులు మరణాల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలను యూనిసెఫ్ హెచ్చరించింది. ఆయా దేశాలలో ప్రజలకు జీవనోపాధి, మెరుగైన పరిస్థితులు కల్పించాలని కోరింది. మరోవైపు ఇటలీ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చట్టాలు అమలు చేస్తోంది. అక్రమంగా వలస వచ్చిన వారిని అల్చేనియా దేశానికి తరలించి వారిని జైళ్లలో పెడుతోంది. దీంతో ఇటలీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఇంటర్నేష్నల్ రెస్కూ కమిటీ తీవ్రంగా విమర్శించింది.