Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత నాలుగు, ఐదు రోజుల నుంచి భాగ్యనగరంలో కుండపోత వర్షం పడుతూనే ఉంది. మొన్న కురిసిన భారీ వర్షానికి నగరంలో పలు చోట్ల వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. నిన్న రాత్రి కూడా భారీ వర్షం పడింది. చాలా చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. నగరవాసులన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడుతోంది.
అయితే.. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. అమీర్ పేట, మైత్రివనం, బల్కంపేట ప్రాంతాలను ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా సీఎం పరిశీలించారు. అక్కడ గంగుబాయి బస్తీ, బల్కంపేటలోని ముంపు ప్రభావిత కాలనీల్లోని ప్రజల పరిస్థితి, అక్కడ రహదారులను దగ్గరుండి సీఎం రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటిస్తున్న క్రమంలో అక్కడ ఏడో తరగతి చదువుతున్న జశ్వంత్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరద నీటి సమస్య గురించి సీఎం ప్రశ్నలు సంధించారు. సమస్య తీవ్రతను సీఎంకు ఆ బాలుడు చక్కగా వివరించినట్టు తెలుస్తోంది.
ALSO READ: Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం
భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ఎదురైన ఇబ్బందుల గురించి ప్రజలతో సీఎం మాట్లాడారు. వారిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్, సంబంధిత అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలను పర్యటించారు. వరద నీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, సహాయక చర్యలపై అధికారులను వివరాలను అడిగారు. ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని.. అవసరం అయితే అదనపు సిబ్బందిని నియమించి సమస్యలను పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ALSO READ: Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!
ముఖ్యంగా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన రహదారులు, పలు ఇళ్లల్లో ప్రవేశించిన వరద నీరును వెంటనే తొలిగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉందో చూడాలని చెప్పారు. మళ్లీ భారీ వర్షాలు పడితే.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. ఈ ఆకస్మక పర్యటనలో మంత్రులు, ప్రజాప్రతి నిధులు, అధికారులు కూడా ఉన్నారు. భాగ్యనగరంలో భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.