YVS Chowdary comments on Jr NTR(Latest news in tollywood): సీనియర్ స్టార్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు బ్యానర్ లో ఆయన ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం నందమూరి వారసుడు, హరికృష్ణ మనవడు, కళ్యాణ్ రామ్ పెద్దన్న జానకి రామ్ కొడుకు ఎన్టీఆర్ ను లాంచ్ చేస్తున్నాడు వైవిఎస్ చౌదరీ. అది కూడా బొమ్మరిల్లు బ్యానర్ లో కాకుండా కొత్త బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ కొత్త బ్యానర్ ను ఈరోజు లాంచ్ చేశారు. న్యూ టాలెంట్ రోర్స్ అనే పేరుతో వైవిఎస్ చౌదరి భార్య గీత ఈ బ్యానర్ ను నడిపిస్తుంది. ఇక నేడు మీడియాతో న్యూ టాలెంట్ రోర్స్ లో తెరకెక్కబోతున్న కొత్త సినిమా విషయాలను వైవిఎస్ చౌదరి పంచుకున్నాడు. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతాన్ని అందించగా, చంద్రబోస్ సాహిత్యం రాయనున్నట్లు తెలిపాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పుకొచ్చాడు.
ఇక ఒక రిపోర్టర్.. ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కదా.. ఆయనతో మీరు ఎందుకు సినిమా చేయలేదు అని అడగ్గా.. వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. ” ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు తారక్ అని మీకు ఎవరు చెప్పారు. నేను ఒకటి చెప్తాను. రేపు అది ప్రింట్ చేస్తారా.. ?. ఎన్టీ రామారావుగారికి తారక్ ఇష్టమైన మనవడు అంటే.. మిగతా మనవళ్లు ఇష్టం లేదనా.. ?. ఒక ప్రశ్న వేసినప్పుడు సర్టిఫికెట్ ఇవ్వకండి. రామారావుకి నేనే ఇష్టమైన మనవడిని అని తారక్ కూడా ఎప్పుడు చెప్పలేదు.
ఎన్టీ రామారావుగారికి అందరు సమానమే. అలాగే నందమూరి వంశంను అభిమానించే వారందరికీ.. రామారావు కుటుంబంలో ఉన్న అందరూ సమానమే. తన పేరును తారక్ కు పెట్టింది కూడా ఎన్టీఆర్ కాదు.. హరికృష్ణ. తన తండ్రి పేరు కలిసి వచ్చేలా కొడుకులకు పేర్లు పెట్టాడు. జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని హరికృష్ణ గారు పెట్టారు” అని చెప్పుకొచ్చాడు. ఇక తారక్ తో సినిమా చేయాలనే ఆలోచన తనకు రాలేదని, వస్తే కచ్చితంగా చేస్తా అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.