Philippines: ఫిలిప్పీన్స్‌ను ఫుంగ్ వాంగ్ పెను తుపాను తీవ్రంగా వణికిస్తోంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలుగు వీస్తున్నాయి. తుపాను కారణంగా తూర్పు, ఈశాన్య తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందినట్టు ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. తుపాను ఉద్ధృతి కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. కాగా పౌర రక్షణ కార్యాలయం అంచనా ప్రకారం ఈ తుపాను సుమారు మూడు కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు.
1800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న తుపాను..
ఫిలిప్పీన్స్‌లో అత్యధిక జనాభా కలిగిన లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్ వద్ద తుపాను తీరాన్ని తాకింది. స్థానికంగా ఉవాన్ అని పిలవబడే ఈ తుపాను 1800 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అధికారులు చెబుతున్న ప్రకారం, దేశ భూభాగంలో దాదాపు మూడింట రెండొంతులు ఈ తుపాను పరిధిలోకి వస్తున్నాయి. అలానే కటండువానెస్ ప్రావిన్స్‌లో సంభవించిన మెరుపు వరదల్లో ఒక వ్యక్తి.. సమర్ ప్రావిన్స్‌లోని కాట్‌బాలొగన్ నగరంలో ఇల్లు కూలిపోవడంతో ఒక మహిళ మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రతతో దృశ్యమానత సున్నా స్థాయికి పడిపోయిందని అధికారులు తెలిపారు.
ఇద్దరు మృతి, 19 మందిని రక్షించిన అధికారులు..
వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ, సహాయక సిబ్బంది ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. బికోల్, తూర్పు విసాయాస్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. కటండువానెస్‌లోని గిగ్మోటో, ఇసాబెలాలోని డైనపిగ్ తీరప్రాంతాల్లో సముద్రం ఉధృతంగా ఎగిసిపడుతోంది. తుపాను కారణంగా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిపోవడంతో అనేక ప్రాంతాలు రోడ్డు మార్గాల నుంచి పూర్తిగా వేరుపడ్డాయి. అనేక ఇళ్లు, వాణిజ్య భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెల్ టవర్స్ దెబ్బతిన్నందున మొబైల్ నెట్‌వర్క్‌లు కూడా నిలిచిపోయాయి.
Also Read: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ
380కి పైగా విమాన సర్వీసులు రద్దు..
మరోవైపు పౌర విమానయాన శాఖ ఇప్పటికే 380కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. తుపాను కారణంగా రైల్వే, రోడ్డు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర ప్రావిన్సుల్లోని పాఠశాలలు, కార్యాలయాలకు సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ తూర్పు తీరంలో సముద్రం పూర్తిగా ఉధృతంగా మారింది. నౌకాయానానికి నిషేధం విధించగా.. తీరప్రాంత గ్రామాల్లోని ప్రజలను అధికారులు ముందుగానే ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తిరిగి తీరం చేరేందుకు సైన్యం సహాయం అందిస్తోంది.