Japan Flu Outbreak: జపాన్‌లో ఫ్లూ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా ఈ ఫ్లూ బారిన పడ్డారు. దాదాపు 3,000 ఆసుపత్రులలో 4,030 మంది ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒకినావా ఆసుపత్రిలో ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. ఆ తరువాత టోక్యో, కగోషిమాలో ఈ కేసులు అధికంగా ఉన్నాయి. పిల్లలలో ఇన్‌ఫ్లుఎంజా మహమ్మారి వ్యాప్తి కారణంగా 100కి పైగా పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు మూసివేశారు.
జపాన్ లో ఇన్‌ఫ్లుఎంజా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ ఫ్లూ సీజన్ కంటే ముందుగానే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ఆసుపత్రులలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మహమ్మారి కరోనా జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని జపనీస్ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది.
జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. అక్టోబర్ 3 వరకు, 4,000 మందికి పైగా ఇన్ఫ్లుఎంజా వైరస్ తో ఆసుపత్రుల్లో చేరారు. తాజాగా గత వారం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 100కి పైగా స్కూళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, కిండర్ గార్టెన్స్ తాత్కాలికంగా మూసివేశారు.
ఈ ఏడాది ఫ్లూ సీజన్ చాలా ముందుగానే ప్రారంభమైందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లూ సీజన్ మారిందని చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు.
ప్రయాణాలు, జన సమూహాలను నివారించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూ కేసులు జాతీయ సగటు అంటువ్యాధి పరిమితిని దాటిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో 1.04 మంది రోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఒకినావా, టోక్యో, కగోషిమాలలో ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
22 మంది విద్యార్థులలో ఇన్ఫ్లుఎంజా లక్షణాలు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రాథమిక పాఠశాలను మూసివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫ్లూ కేసులు సాధారణం కంటే త్వరగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వెంటనే టీకాలు వేయించుకోవాలని సూచించింది.
ఈ ఫ్లూ ప్రాణాపాయం కాదని, ముందస్తు టీకాలు వేయడం నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. కోవిడ్ సమయంలో సంక్షోభాన్ని మరోసారి ఫ్లూ పరిస్థితులు గుర్తుచేస్తున్నట్లు జపనీస్ మీడియా రిపోర్టు చేస్తుంది. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది.
Also Read : Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి
ప్రజలు అనవసరంగా ఆసుపత్రులకు రావొద్దని, లక్షణాలు కనిపిస్తేనే వైద్యులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే విదేశీ పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడంతో ఫ్లూ వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఫ్లూ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు.