Austria News: ఆస్ట్రియా దేశంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. గ్రాజ్ రీజనల్ ఆసుపత్రిలో 2024 జనవరిలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక బ్రెయిన్ సర్జన్ తన 12 ఏళ్ల కుమార్తెను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి.. ఓ పేషంట్ మెదడుకు రంధ్రం వేయడానికి అనుమతించినట్లు సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన తీవ్రమైన వివాదానికి దారి తీసింది. ఆ సర్జన్‌పై ఇప్పుడు క్రిమినల్ ట్రయల్ కూడా నడుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటనలో బాధితుడు ఒక 33 ఏళ్ల వయస్సు గల వ్యక్తి. అతను ఓ రోడ్డు ప్రమాదంలో తలకు బలంగా గాయం కావడంతో ఆసుపత్రిలో చేరాడు. ఆపరేషన్‌ను ఇద్దరు వైద్యులు చేశారు. అందులో ఒకరు సీనియర్ ఫిజీషియన్. మరొకరు ట్రైనీ న్యూరోసర్జన్ ఉన్నారు. ఆపరేషన్ దాదాపు పూర్తయిన తర్వాత, సీనియర్ ఫిజీషియన్ తన 12 ఏళ్ల కుమార్తెను పుర్రెలో రంధ్రం వేయడానికి అనుమతించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికిత్స అనంతరం ఆమె నర్సులతో తన కుమార్తె తన మొదటి గైనకాలజికల్ హిస్టెరెక్టమీ పూర్తి చేసిందని గొప్పగా చెప్పుకున్నారు.
ALSO READ: BEL Notification: నిరుద్యోగులకు పండుగే.. బెల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, నెలకు రూ.90వేల జీతం
ఈ విషయం కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాసిక్యూటర్ జూలియా స్టీనర్ ఈ సంఘటనను రోగి పట్ల అసాధారణ అగౌరవగా అభివర్ణించారు. ఒకవేళ డ్రిల్ పనిచేయకపోతే లేదా ఆటోమేటిక్‌గా ఆగకపోతే ఏమై ఉండేది అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయలేమని అన్నారు.
అయితే.. ఆ సర్జన్ ఈ ఆరోపణలను ఖండించారు. తన కుమార్తెను ఆపరేటింగ్ టేబుల్ వద్దకు అనుమతించడం తన అతిపెద్ద తప్పిదమని, అది ‘మూర్ఖమైన తల్లి గర్వం’ వల్ల జరిగిన పొరపాటు అని ఆమె కోర్టులో చెప్పారు. ఆమె జూనియర్ సహోద్యోగి మాత్రం ఆ 12 ఏళ్ల బాలిక డ్రిల్‌లో సహాయం చేసినప్పటికీ, తాను ఎల్లప్పుడూ ఆ సాధనాన్ని నియంత్రణలో ఉంచానని ఒప్పుకున్నారు.