Afghan Pak Clash: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరుదేశాల అధికారులు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించారు. కాల్పుల విరమణ అనంతరం తాలిబన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్‌లో సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ సైనికుల ప్యాంటును ఊరేగిస్తూ కవాతు చేశారు.
48 గంటల పాటు కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి. దక్షిణాసియా దేశాలైన పాక్, ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో బుధవారం ఇరువైపుల అధికారులు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించారు. ఇస్లామాబాద్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాలు బుధవారం మధ్యాహ్నం 1:00 గంట నుంచి 48 గంటల పాటు “తాత్కాలిక కాల్పుల విరమణ”కు అంగీకరించాయని పేర్కొంది. కాబూల్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ కుదిరిందని తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనతో కాల్పుల విరమణ జరిగిందని అన్నారు. కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని కాబూల్ తన దళాలను ఆదేశించిందన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పాక్-ఆఫ్ఘన్ కాల్పుల విరమణను స్వాగతించారు. ఇరు దేశాల ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా నిరోధించాలని, శాశ్వత కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
2021లో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత బుధవారం జరిగిన పోరాటం రెండు ఇస్లామిక్ దేశాల మధ్య అత్యంత బీకరమైన పోరు జరిగింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను నియంత్రించాలని ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇస్లామాబాద్ డిమాండ్ చేసింది. అనంతరం ఇటీవలి ఘర్షణలు తలెత్తాయి. ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుంది.
తాలిబన్లు పాక్ ఆరోపణను కొట్టిపారేస్తు్న్నారు. పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తుందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. సరిహద్దులో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి కాబూల్ ను దెబ్బతీసేందుకు ఐసిస్ ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని అంటున్నారు. తాలిబన్ల ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.
స్పిన్ బోల్డాక్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో తమ పౌరులు డజనుకు పైగా మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడులను తాము ప్రారంభించలేదని ఇస్లామాబాద్ చెబుతోంది. సరిహద్దు వెంబడి చమన్ జిల్లాలో తాలిబాన్ దాడుల్లో పాక్ పౌరులు నలుగురు గాయపడ్డారని పేర్కొంది.
48 గంటల కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు వేడుకలు చేసుకున్నారు. పాకిస్తాన్‌పై విజయం సాధించామని తాలిబన్లు ఆఫ్ఘన్ వీధిల్లో సంబరాలు చేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో పాకిస్తాన్ సైనికుడి ప్యాంటును తాలిబన్లు వీధుల్లో ఊరేగించారు. ఆఫ్ఘన్ సైనికుల పోరాట సమయంలో పాక్ సైనికులు తమ పోస్టులను విడిచిపెట్టినట్లు పారిపోయారని అంటున్నారు.
Also Read: Austria News: ఆపరేషన్ రూమ్‌లో 12 ఏళ్ల బాలికతో.. రోగి మెదడకు రంధ్రం పెట్టించిన సర్జన్, చివరికి..?
మరికొన్ని వీడియోలలో పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న ట్యాంకులు, ఆయుధాలను ఆఫ్ఘన్ దళాలు పరేడ్ చేస్తున్నట్లు కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు నాంగ్రాహర్ ప్రావిన్స్ డ్యూరాండ్ లైన్ సమీపంలో పాకిస్తాన్ సైన్యం వదిలివెళ్లిన సైనిక పోస్టుల నుండి స్వాధీనం చేసుకున్న ‘పాక్ సైనికుడి ప్యాంటు’ అనే ఎక్స్ లో బీబీసీ జర్నలిస్ట్ ఈ ఫొటో షేర్ చేశారు.